42లీటర్ల పాలు దానం చేసిన తల్లి.. మరో ఏడాదైనా ఇస్తానంటూ..

P.Phanindra
ఎవరైనా దానం చేయాలంటే ఆహారమో, డబ్బులో, మహా అయితే అవయవాలో దానం చేస్తారు. కానీ ఈ తల్లి తన పాలు దానం చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 లీటర్ల పాలు దానం చేసింది. అక్కడితో ఆగకుండా ఇలా కనీసం మరో ఏడాదిపాటు పాలు దానం చేస్తానంటోంది. అసలు ఎవరీమె? అంటే.. బాలీవుడ్ సినిమా నిర్మాత నిధి పార్మర్ హీరానందాని. ‘సాంద్ కీ ఆంఖ్’ అనే బాలీవుడ్ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన నిధి.. ఇటీవలే తల్లి అయింది. తల్లి అయిన వారందరికీ వచ్చినట్లే ఆమెకు కూడా చనుబాలు వచ్చాయి. అయితే వాటిని తన పిల్లాడికి మాత్రమే పట్టకుండా ఓ ఆస్పత్రికి దానమిచ్చిందామె. ఇలా ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 లీటర్ల పాలు దానం చేసినట్లు వెల్లడించింది.
42 ఏళ్ల వయసులో తల్లి అవడమే కష్టం. అలాంటిది తల్లి అవడమే కాక ఇలా 42 లీటర్ల చనుబాలు దానం చేయడంతో నిధి వార్తల్లో నిలిచింది. తన బిడ్డ కోసం చనుబాలు తీసి పక్కన పెట్టానని, ఇలా తీసిన పాలు మరీ ఎక్కువై వృధా అవుతున్నాయని నిధి చెప్పింది. ఇలా పక్కన పెట్టేసే కన్నా ఎవరికైనా దానం చేయడం మంచిదనే ఆలోచన రావడంతో.. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని చనుబాలను దానం చేసింది. ఇది మే నెలలో మొదలైందని, అప్పటి నుంచి దాదాపు 42 లీటర్ల పాలు దానం చేశానని నిధి తెలిపింది.

ఇలా తాను దానం చేసిన పాలు ఏం అవుతున్నాయో తెలుసుకునేందుకు నిధి ఓసారి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఓ 60 మంది పసికందులకు ఆమె పంపిన పాలనే పట్టిస్తుండటం చూసింది. ఆ మాట వినగానే తనకెంతో సంతోషం కలిగిందని నిధి చెప్పింది. తన చనుబాలు తాగుతున్న పిల్లలందరికీ ఆ పాలు చాలా అవసరమని, వారికోసం తాను మరో ఏడాదిపాటు పాలు దానం చేస్తూనే ఉంటానని నిధి స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: