హెరాల్డ్ సెటైర్ : పవన్ గాలి తీసేసిన తమిళ మీడియా

Vijaya
జనసేన అధినేత పవన కల్యాణ్ గొప్పదనం పొరుగు రాష్ట్రాలకు పాకిపోయింది. పవన్ వైఖరిపై ప్రచురితమైన ఓ కథనంలో తమిళ దినపత్రిక గాలి తీసేసింది. పవన్ వ్యక్తిత్వంపై చెన్నైలోని పాపులర్ ఈవెనింగ్ డైలీ ‘తమిళ మురుసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో పవన్ను ఓ గందరగోళ నేతగా అభివర్ణించింది. పవన్ గందరగోళ రాజకీయ వాదిగా తెలంగాణా, ఏపి ప్రజల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నట్లు ఈవెనింగ్ డైలీ కథనంలో ఎద్దేవా చేసింది. తన కథనానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలే ఉదాహరణగా సదరు దినపత్రిక చెప్పటం విశేషం.



మొదట జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించటం, కొందరికి బీఫారంలు జారీ చేయటం తర్వాత పోటీ నుండి విత్ డ్రా చేసుకుంటున్నట్లు చెప్పిన విషయాలను సదరు పత్రిక తన కథనంలో వివరంగా ప్రస్తావించింది. 2014లోనే పార్టీ పెట్టిన పవన్ అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం బీజేపీ, టీడీపీలకు మద్దతుగా మాత్రమే ప్రచారం చేసిన విషయాన్ని కూడా గుర్తుచేసింది.ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో అసలు పోటీ విషయాన్నే పట్టించుకోలేదని చెప్పింది. తర్వాత 2018లో జరిగిన తెలంగాణా ముందస్తు ఎన్నికలకు ముందు బాగా హడావుడి చేసిన పనవ్ చివరకు ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. తర్వాత 2019లో ఏపి ఎన్నికల్లో పోటీ చేయటం, రెండుచోట్ల ఓడిపోవటం, పార్టకి వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా తన కథనంలో వివరించింది.



2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మిత్రపక్షంగా ఉన్న పవన్ తర్వాత బీజేపీపై ఆరోపణలు చేయటం, టీడీపీపై కొన్నిసార్లు ఆరోపణలు చేయటం, తర్వాత మళ్ళీ కలిసిపోవటాన్ని కూడా చెప్పింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బిఎస్పీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలైపోగానే మాట మాత్రమైనా చెప్పకుండానే వాటిని వదిలేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పింది. ఇలా తడవొక పార్టీతో పొత్తు పెట్టుకోవటం, ఎన్నికల్లో పోటీ చేస్తానని ఒకసారి చెప్పటం, వెంటనే చేయటం లేదని ప్రకటించటం లాంటి అనేక ఉదాహరణలు చెప్పి పవన్ను ఓ గందరగోళ నేతగా తేల్చేసింది సదరు పత్రిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: