ఎడిటోరియల్ : చివరికి సర్వేలే నిజమవుతాయా ? టిడిపి పరిస్ధితి అంత దారుణమా ?

Vijaya

దాదాపు ఏడాదికాలంగా లోక్ సభ ఎన్నికల విషయంలో ఏపికి సంబంధించి జాతీయ మీడియా చేసిన సర్వేలే నిజమయ్యేట్లుంది చూడబోతే. దాదాపు పది సంస్ధల సర్వేల్లో ఒకటే రిజల్టు. మెజారిటీ సీట్లు వైసిదేనని. ఉన్న 25 పార్లమెంటు సీట్లలో వైసిపి 19-23 సీట్ల మధ్యలో గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. దాంతో తట్టుకోలేకపోయిన టిడిపి సర్వేలతో పాటు వైసిపిని కూడా బాగా ఎద్దేవా చేశారు.

 

సీన్ కట్ చేస్తే చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాల వారీ సమీక్షలను చూస్తుంటే సర్వేలన్నీ నిజమే అవుతాయోమనే అనిపిస్తోంది. మామూలు జనాలకే కాదు టిడిపి నేతల్లోనే ఆ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉన్నవి 25 పార్లమెంటు నియోజకవర్గాలు. అందులో పోయిన ఎన్నికల్లో టిడిపి గెలిచింది 15. అందులో కూడా ఇద్దరు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన ఎంపిలు 13 మంది.

 

 మిగిలిన 13 మంది ఎంపిల్లో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయటానికి 10 మంది వనకాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోవటం లేదని కూడా ఇప్పటికే చంద్రబాబుకు చెప్పేశారు. దాంతోనే టిడిపి పరిస్దితి ఎంత దయనీంగా ఉందో తెలిసిపోతోంది. శ్రీకాకుళం ఎంపి కింజరాపు రమ్మోహన్ నాయుడు పోటీకి ఇష్టపడటం లేదు. విజయనగరం ఎంపిగా అశోక్ గజపతిరాజు పోటీకి ఇష్టపడటం లేదు. విశాఖపట్నం నుండి ఎవరు పోటీ చేయటానికి ముందుకు రావటం లేదు. వచ్చిన లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ కు టికెట్ ఇవ్వటం ఇష్టం లేదని సమాచారం. అరకు స్ధానానికి కొత్త బకరా కిషోర్ చంద్రదేవ్ దొరికారు లేండి.

 

తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి మూడు స్ధానాలూ ఖాళీనే. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నుండి మాగంటి బాబు పోటీ చేస్తారు. నర్సాపురం స్ధానం ఖాళీనే. రఘురామ కృష్ణంరాజును చంద్రబాబు ఖాయం చేస్తే ఆయనేమో వైసిపిలో చేరారు. గుంటూరులో గల్లా జయదేవ్ పోటీ ఖాయమే. నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావు పోటీ చేయనని చెప్పేశారు.  కృష్ణాజిల్లాలో విజయవాడలో కేశినేని పోటీ చేసేది సందేహమే. మచిలీపట్నంలో పోటీ చేయనని  కొనకళ్ళ నారాయణ చెప్పేశారట.

 

ప్రకాశం జిల్లా ఒంగోలులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు చెబుతున్నా ఆయన మాత్రం వెనకాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో పోటీకి ఎవరూ ముందుకు రావటం లేదు. రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రెడీనే. నంద్యాలలో ఎవరూ ముందుకు రావటం లేదు. అనంతపురం, హిందుపురంలో కొత్త వాళ్ళని వెత్తుక్కోవాల్సిందే. కడప, రాజంపేట సీట్లలో కూడా ఇదే పరిస్ధితి. చిత్తూరులో శివప్రసాదే దిక్కు. తిరుపతిలో కూడా వెతుక్కోవాల్సిందే. చూశారా అధికారంలో ఉన్న టిడిపి పరిస్ధితి ఎలాగుందో. కాబట్టి సర్వేలు నిజమయ్యేట్లే ఉందని అనుమానం రావటం లేదూ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: