ఎడిటోరియల్ : మూడు జిల్లాలపైనే పవన్ టార్గెట్ ?

Vijaya

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత ప్రధానంగా మూడు జిల్లాలపైనే దృష్టి పెట్టినట్లు సమాచారం. కాపు సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ పార్టీని స్ధాపించారన్న విషయం అందరికీ తెలిసిందే. చెప్పటానికేమో తాను అందరి వాడినని, తనను ఏదో ఓ కులానికి పరిమితం చేయొద్దని చెబుతుంటారు. వాస్తవానికి కాపుల ఓట్లనే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే ఉభయగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాల్లోని ఓట్లనే లక్ష్యంగా చేసుకున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే, ఇప్పటి  వరకూ పవన్ జరిపిన యాత్రల్లో ఎక్కువసార్లు పై జిల్లాల్లోనే పర్యటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

 

ఇప్పటివరకూ పై మూడు జిల్లాల్లో కనీసం మూడేసిసార్లు పర్యటించారు. ఇప్పటివరకూ రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలో అసలు అడుగే పెట్టలేదు. చంద్రబాబునాయుడుకు సాయం చేయటంలో భాగంగానే పవన్ రాజధాని జిల్లాల్లో పర్యటించలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి లేండి. పోయిన ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో వైసిపి ఒక్కసీటు కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని 19 సీట్లలో టిడిపి 14 స్ధానాల్లో గెలవగా వైసిపి 5 సీట్లలో గెలిచింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని 15 స్ధానాల్లో టిడిపి 14 సీట్లలో గెలిస్తే అప్పటి మిత్రపక్షం బిజెపి ఒక్క సీటు గెలిచింది. దాంతో వైసిపికి అసలు బోణినే కాలేదు.

 

ఇక రాయలసీమ విషయానికి వస్తే చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాలో వైసిపిదే పైచేయి అయినా అనంతరపురం జిల్లాలో మాత్రం పూర్తిగా దెబ్బ పడిపోయింది. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది కేవలం 2 సీట్లు మాత్రమే. మిగిలిన 12 సీట్లను టిడిపినే గెలిచింది. అంటే మూడు జిల్లాల్లోని 48 సీట్లలో టిడిపి 40 సీట్లు గెలుచుకున్నది. ఈ మూడు జిల్లాల్లో గెలిచిన సీట్లతోనే టిడిపి అధికారంలోకి వచ్చిందంటే అతిశయోక్తి ఏమీలేదు.

 

ఇక్కడ విషయం ఏమిటంటే జనసేన సహకరం, మద్దతుతోనే టిడిపి పై జిల్లాల్లో టిడిపి 40 సీట్లు గెలిచిందని పవన్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే టిడిపి అధికారంలోకి వచ్చిందంటే కేవలం తన వల్లే అని పవన్ పదే పదే చెబుతున్నారు. పై మూడు జిల్లాల్లోనే పవన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కాబట్టి వచ్చే జిల్లాల్లో తను గనుక పై మూడు జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెడితే మిగిలిన పార్టీలకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని పవన్ నమ్ముతున్నారట. అందుకనే ఎక్కువగా పై జిల్లాల్లోనే తిరుగుతున్నారు.

 

రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రవుతానని పవన్ పదే పదే చెప్పటం వెనుక కూడా అదే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. పై జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించి మిగిలిన జిల్లాల్లో ఓ పదో పదహైదో సీట్లు సాధించి అంటే మొత్తం మీద ఓ 40 సీట్లు సాధిస్తే తానే ముఖ్యమంత్రిననే ఆలోచన పవన్ లో బాగా నాటుకుపోయిందట. టిడిపి, వైసిపిలు సొంతంగా అధికారం చేపట్టేంత బలం సొంతంగా తెచ్చుకునే అవకాశం లేదని పవన్ భావిస్తున్నారట. ఎలాగూ ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం లేదు కాబట్టి అయితే టిడిపినో లేకపోతే వైసిపినో వేరే దారిలేక జనసేనకే మద్దతు ప్రకటిస్తాయనే భ్రమల్లో ఉన్నారు పవన్. మరి ఓటర్లు ఏమి చేస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: