కత్తి వర్సెస్ స్వామీజీ : పోలీసుల మధ్యేమార్గం..!!

Vasishta

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై వేటు పడింది. హైదరాబాద్ నగర బహిష్కరణ విధిస్తూ తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనుమతి లేకుండా హైదరాబాద్‌ నగరానికి రాకూడదని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు.. కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ధర్మ దీక్షకు సిద్ధమైన శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన పాదయాత్రను కూడా పోలీసులు అడ్డుకున్నారు..


వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీరాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కత్తి మహేష్ ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులకు కత్తిని అప్పగించారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.


కత్తి మహేశ్ వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు అత్యవసరంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో పాటు డీసీపీలు, ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేయడంపై డీజీపీ చర్చించారు. సమాజంలో అలజడులు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేశ్‌ నగరంలో ఉండటానికి అనర్హుడంటూ ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు..


శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనిపై హిందువులందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పరిపూర్ణానంద పాదయాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన బయటకు రాకుండా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు.. పరిపూర్ణ నంద స్వామి గృహనిర్భంధంపై బ్రాహ్మణ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: