రూ.25 ఓకే..క్షురకుల సమ్మె విరమణ!

siri Madhukar
గడచిన నాలుగు రోజులుగా తమకు కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని క్షురకులు కోరుతున్నారు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన క్షురకులకు రూ.5 వేల పింఛన్‌‌ ఇవ్వాలని డిమాండ్ ‌చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో మొదలైన ఆందోళన క్రమంగా రాష్ట్రమంతటా వ్యాపించింది.  తిరుమల తిరుపతి దేవస్థానం మినహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో క్షురకులు ఆందోళన నిర్వహిస్తున్నారు.  తాజాగా  తాము చేస్తున్న సమ్మెను విరమించేందుకు నిర్ణయించుకున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం జేఏసీ ప్రకటించింది.

కేశ ఖండన టికెట్ పై ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 ను రూ. 25కు పెంచుతున్నట్టు సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు తాము అంగీకరిస్తున్నట్టు తెలిపారు. నిన్న రాత్రి ఉండవల్లి లోని ప్రజాదర్బారులో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సీఎంతో సమావేశమై చర్చించారు.  కాగా, నిన్న సాయంత్రం తన విధులు ముగించుకుని చంద్రబాబు వెళుతున్న వేళ, కొందరు క్షురకులు 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేయగా, చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

అమరావతిలో చంద్రబాబును నిలువరించి గలాటా చేసింది ఎవరో తమకు తెలియదని జేఏసీ అధ్యక్షుడు గుంటుపల్లి రామదాస్ తెలిపారు. దీనిపై మీడియాలో అదేపనిగా వార్తలు రావడంతో, సీఎంను కలిసి క్షమాపణలు చెప్పామని, మిగిలిన సమస్యలను కూడా సానుకూలంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని జేఏసీ గౌరవాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: