అంతా పండుగ సందట్లో ఉంటే.. వీళ్లేం చేశారో చూడండి..!

Chakravarthi Kalyan
అసలే సంక్రాంతి పండుగ.. తెలుగువారికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వారికి ఇదే అతి పెద్ద పండుగ. ఈ పండుగకు ఎక్కడున్నా సొంతూరుకి వెళ్లిపండుగ జరుపుకోవడం ఆంధ్రావారికి ఓ తప్పనిసరి లాంఛనం. అందుకే పండుగ మూడు రోజులు ఆంధ్రాలోని పల్లెటూళ్లు కళకళలాడతాయి. సరిగ్గా దీన్నే అవకాశంగా మలుచుకున్నారు కొందరు దొంగలు.. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాప్రాంత జనం సొంతూళ్లకు వెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. 



హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నగర శివారు ప్రాంతాల్లో వరుస చోరీలతో దొంగలు హడలెత్తించారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేశారు. లంగర్ హౌజ్ ప్రాంతంలోని బండ్లగూడలో గంట వ్యవధిలోనే  ఆరు ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటే వీరి జోరు ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంటికి తాళం కనపడితే చాలు.. ఆ ఇంటిని లూటీ చేయడం మొదలుపెట్టారు. ఎలాగూ పండగకు వెళ్లారు కదా.. ఇప్పట్లో వచ్చే వారు ఎవరూ ఉండరన్న ధీమాతో స్వేచ్చగా దొంగతనాలు కానిచ్చేశారు. 



రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, నవోదయ కాలనీలో గంట వ్యవధిలో ఆరు ఇళ్లలో చోరీలు జరిగాయి. మొత్తం లక్షా యాభై వేల నగదు, 50తులాల బంగారం, లాప్ టాప్, కారును దొంగలు ఎత్తుకెల్లారు. సాయిబాబా కాలనీలో నివాసం ఉండే భరణికుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. కుటుంబ సభ్యులందరూ రాత్రి సినిమాకు వెళ్లారు. సినిమా ముగిశాక ఇంటికి తిరిగి వచ్చే సరికి.. 32తులాల బంగారు, 5వేల నగదు ఎత్తుకెళ్లారు. కారు తాళాలు తీసుకొని కారును కూడా ఎత్తుకెళ్లారు.



ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ దొంగతనానికి గురైన ఇళ్లలో ఏసీబీ కానిస్టేబుల్ ఇల్లు కూడా ఉండటం విశేషం. ఏసీబీ కానిస్టేబుల్ రమణ ఇంట్లో 10తులాల బంగారం, 80వేల నగదు ఎత్తుకెళ్లారు. వెనుక వీధిలో మరో ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు 8వేల నగదును ఎత్తుకెళ్లారు. నవోదయ కాలనీలోనూ రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఇక్కడ ఏమీ దొరకపోవడంతో ఇంట్లోని సామానును దొంగలు వదిలేసి వెళ్లారు. దొంగలు జీన్స్ ప్యాంటు, బూట్లు వేసుకొని ముఖానికి మాస్క్ కట్టుకున్నారు. ఊళ్లకు వెళ్లేముందు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే గస్తీ పెంచుతామన్న పోలీసుల సూచనలు వీరు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: