ఉపేంద్ర పొలిటికల్ పార్టీ..!! నిలబడతారా..!?

Vasishta

సినిమా స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు తారలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన కొన్నాళ్లకే కర్నాటకలో ఉపేంద్ర పొలిటకల్ పార్టీ అనౌన్స్ చేశారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేశాడు. కొన్నాళ్లుగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతున్న వేళ సడన్ గా పార్టీ విధివిధానాలను ప్రకటించారు. సామాన్యుల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పార్టీ ఉంటుందని చెప్పారు. బెంగళూరులోని గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో కొత్త పార్టీ రూపురేఖలు, ఎజెండాను వివరించాడు. పార్టీ పేరును ‘కర్ణాటక ప్రజావంత జనతాపక్ష’గా ప్రకటించారు.


ఉపేంద్ర ప్రకటించిన పార్టీ పేరు ‘కర్ణాటక ప్రజావంత జనతాపక్ష’ను ఇప్పటికే  మహేష్ గౌడ అనే వ్యక్తి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారు. దాన్ని ఉపేంద్రకు ఇచ్చేశారు. పార్టీ ప్రకటన సందర్భంగా పార్టీకి సంబంధించి యాప్ లాంచ్ చేసిన ఉపేంద్ర.. నవంబర్ 10న పార్టీ వెబ్ సైట్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఎవరైనా తన పార్టీలో ఉచిత సభ్యత్వం తీసుకోవచ్చని ప్రకటించారు. తన ఆఫీస్ ను కేవలం పార్టీ కార్యాలయంలా కాకుండా.. నలుగురు కలిసి ఆలోచనలు పంచుకునే స్మార్ట్ ఆఫీస్ గా మార్చేస్తానని చెప్పారు.


కర్ణాటక రాష్ట్ర అవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందే హీరో ఉపేంద్ర తన కొత్త రాజకీయ పార్టీ ని ప్రకటించారు. పార్టీ లాంచింగ్ కి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఉపేంద్ర కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సైతం ఖాకీ చొక్కా ధరించారు. పార్టీ గుర్తు, విధివిధానాలపై అభిమానులతో ఉపేంద్ర చర్చించారు. ఆటోరిక్షా లేదా చెప్పు గుర్తును తన పార్టీ గుర్తుగా ఎంపికచేసే అవకాశం ఉంది. ఎక్కువ మంది మాత్రం ఆటోరిక్షా గుర్తు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర, ఆయన తల్లిదండ్రులు, సోదరుడు సుదీంద్ర పాల్గొన్నారు.


కర్ణాటకలో ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని ఉపేంద్ర చెప్పారు. ప్రతి రంగంలో మార్పురావాలని ఉపేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే 60, 70 శాసన సభ నియోజక వర్గాలకు పోటీ చెయ్యడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలా ? వద్దా ? అనే అలోచనలో ఉన్నానని రియల్ స్టార్ ఉపేంద్ర వివరించారు. కర్ణాటకలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఉపేంద్ర పార్టీ పెట్టడం ప్రాధన్యతను సంతరించుకుంది. తొలుత బీజేపీకి మద్దతిస్తారనే ప్రచారం జరగినప్పటికీ సొంత పార్టీ పెట్టేందుకు మొగ్గు చూపారు. పార్టీ ప్రకటన సందర్భంలోనూ ఉపేంద్ర తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. మోడీ ఆచరణలోకి తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ కార్యక్రమాన్ని కాస్త మార్చి తాను స్మార్ట్ విలేజ్ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఉపేంద్ర ప్రకటించారు.


మరి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్నాటకలో ఉపేంద్ర పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఉపేంద్ర.. ఆ పార్టీతో కలిసి ముందుకెళ్తారా.. లేక ఒంటరిగా బరిలోకి దిగుతారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: