కమల్ హాసన్ ఆ రోజే ఎందుకు పార్టీ పెడుతున్నారో తెలుసా..?

Vasishta

తమిళనటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కొంతకాలం క్రితమే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన కమల్.. బుధవారం అభిమాన సంఘాలతో భేటీ అయ్యారు. వాళ్ల ఒపీనియన్ తీసుకున్న తర్వాత పార్టీ విధి విధానాలు, సింబల్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.


          తమిళనాడులో మరో రాజకీయ పార్టీ రంగ ప్రవేశం చేస్తోంది. కమల్ హాసన్ నేతృత్వంలో ఈ పార్టీ రాబోతోంది. ఇందుకోసం నవంబర్ ఏడో తేదీన ముహూర్తం ఖరారు చేశారు. నవంబర్ 7 కమల్ హాసన్ పుట్టిన రోజు. అదే రోజు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అభిమాన సంఘాలతో విస్తృతస్థాయి చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్జీ జెండా, అజెండా తదితర అంశాలపై కమల్ వారితో చర్చలు జరిపారు.


          జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఓ విధమైన శూన్య వాతావరణం నెలకొంది. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలు తమిళనాడు ప్రజల ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. పలువురు నటులు కూడా ఆ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ ఒకింత ముందుకెళ్లి పళనిస్వామి సర్కార్ ను భర్తరఫ్ చేయాలన్నారు. ఆయన మంత్రివర్గం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.


          కమల్ హాసన్ కామెంట్స్ నేపథ్యంలో బీజేపీలో చేరతారని భావించారు. అయితే తాను బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరవి విజయన్ ను కలిశారు. లెఫ్ట్ భావజాలానికి కమల్ ఆలోచనలు దగ్గరగా ఉంటాయని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన లెఫ్ట్ పార్టీలతో కలసి పనిచేయవచ్చని అంచనా వేస్తున్నారు.


          కమల్ హాసన్ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ దిల్లీ నుంచి చెన్నై వచ్చి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ భేటీ తర్వాత తమిళనాడులో ఆప్ బాధ్యతలను కమల్ హాసన్ చూడవచ్చని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై కమల్ హాసన్ కానీ, కేజ్రివాల్ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.


          రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన తర్వాత రజనీని కూడా తనతో కలసి రావాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. అయితే రజనీ మాత్రం ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు. పైగా.. రాజకీయాల్లో రాణించేందుకు పలుకుబడి, డబ్బుంటే సరిపోవని.. దానికి ఏం కావాలో కమల్ కు తెలుసనుకుంటున్నానన్నారు. రాజకీయాలపై రజనీ వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.


          ఇంతలో కమల్ హాసన్ తన అభిమాన సంఘాలతో భేటీ అవడం, పార్టీ జెండా, విధివిధానాలపై చర్చలు జరపడం, నవంబర్ ఏడో తేదీన పార్టీని ప్రకటించాలని డిసైడైపోవడం జరిగిపోయాయి. దీంతో తమిళనాడులో మరో సినిమా స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లైయింది. మరి కమల్ హాసన్ అదృష్టం ఎలా ఉందో వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: