రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలనే మంత్రి లోకేశ్ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. విద్యాశాఖలో సాధికారత దిశగా లోకేశ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి నిపుణులను విసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి అభినందనలు తెలిపారు.ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇలాగే ముందుకు సాగాలని ఆయన సూచించారు. కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలని లోకేష్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగా నిపుణులను వీసీలుగా నియమించాలని భావించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు ఆయన సంకల్పించారు.ఇదిలావుండగా అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు.
ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం యూఎస్ కాన్సుల్ జనరల్ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. జెన్నిఫర్ లార్సన్ను, ఆమె బృందాన్ని పవన్ కల్యాణ్ సత్కరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.