గత రెండు రోజులుగా హైదరాబాద్ మహానగరంలో ఇద్దరు రాజకీయ నేతల మధ్య విపరీతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అందులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య రాజేసుకున్నటువంటి గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. అయితే పాడికౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని లేదంటే చీరే, గాజులు వేసుకొని తిరగాలని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇందులో అరికెపూడి గాంధీని కూడా తీవ్రంగా విమర్శించడంతో ఆయన స్పందించారు. అరికెపూడి గాంధీ అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, బీఆర్ఎస్ లో గెలిచి పార్టీ మారాడని గాంధీ ఇంటి ముందు 11 గంటలకు బీఆర్ఎస్ జండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాళ్లు స్వీకరించినటువంటి గాంధీ 11 గంటలకు కౌశిక్ రెడ్డి నా ఇంటికి ముందుకు రాకపోతే 12 గంటలకు నేనే ఆయన ఇంటికి వెళ్లి బుద్ధి చెబుతానని అన్నాడు.
అలా 12 గంటల సమయంలో గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయినా గాంధీ అనుచరులు కొంతమంది రాళ్లు, టమాటలతో కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి చేశారు. ఇలా ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం ఘాటు విమర్శలకు కూడా దారితీసింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశాడు. సాధారణంగా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీకి పీఏసీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి గాంధీకి ఈ చైర్మన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై స్పందించినటువంటి గాంధీ నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, దేవాలయాల్లో కప్పే కండువానే కప్పుకున్నారని తనపై ఇలా విమర్శలు చేయడం బాగుండదని అన్నారు. నేను ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కౌశిక్ రెడ్డి తన ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పుతా ఆయన కప్పుకోవాలంటూ సవాల్ విసిరారు.
ఇలా వీరిద్దరి మధ్య గొడవ చివరికి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసింది. నేను తెలంగాణ పౌరుడినని ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన వారు బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో పరిణామాలన్నీ మారిపోయాయి. అంతేకాదు నువ్వు ఆంధ్ర నుంచి బ్రతకడానికి వచ్చిన వ్యక్తివి నువ్వు నాపై దాడి చేస్తే ఊరుకుంటానా నేను కూడా ప్రతిదాడి చేస్తానంటూ హెచ్చరించాడు. నువ్వు వెంటనే శేర్లింగంపల్లి వదిలేసి వెళ్లాలని, కౌశిక్ రెడ్డి అన్నారు. దీనిపై కౌంటర్ గా గాంధీ శేర్లింగంపల్లి మీ అయ్య జాగిరి ఏం కాదు అనడంతో కౌశిక్ రెడ్డి ఇది నా అయ్య జాగిరి తాను తెలంగాణ బిడ్డనని, నీలాగా బతకడానికి వచ్చిన ఆంధ్ర వ్యక్తిని కాదని, కృష్ణాజిల్లాని విడిచిపెట్టి బ్రతకడానికి వచ్చింది గాంధీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విధంగా ఇద్దరి మధ్య వచ్చినటువంటి పర్సనల్ గొడవ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే విధంగా సెంటిమెంటు రాజకీయాలకు దారితీస్తూ ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే విధంగా చేస్తున్నారని చెప్పవచ్చు.