తెలంగాణ రాష్ట్రంలో... గులాబీ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చి నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో... కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడం కాదు... తెలంగాణకు సంబంధించిన 26 మంది ఎమ్మెల్యేలు... బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు.
కరీంనగర్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిట్ చాట్ లో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. కానీ బీజేపీ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే వాళ్లు తర్జనభర్జన అవుతున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కేకే లాంటి వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని చురకలు అంటించారు.
బీఆర్ఎస్ సర్కార్ చేసిన అక్రమాలను వారి ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ ని అధిష్టానం ప్రకటిస్తుందని బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయని స్పష్టం చేశారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు... వివిధ రాష్ట్రాల సీఎం లు అడిగారన్నారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని... వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీం లో చేర్చుతామని హామీ ఇచ్చారు.