కాట్ర‌వ‌ల్లీ... అబ‌ద్ధాల ఆలీ... ప్లేట్ మొత్తం తిప్పేశాడుగా...?

RAMAKRISHNA S.S.
సినిమాల్లో కాట్రవల్లి అన్న డైలాగ్ తో బాగా ఫేమస్ అయిన సీనియర్ నటుడు ఆలీ.. తెరమీద బాగా నటించారు.. నటిస్తున్నారు. అలాగే నిజజీవితంలోనూ.. రాజకీయాల్లోనూ.. నటించాలని ఎంత ప్రయత్నించినా ఆ నటన దాగటం లేదు. 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీలో తన వంతు పాత్ర పోషించారు ఆలీ. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద పదవి వస్తుందని ఆశించారు. ఒకానొక దశలో రాజ్యసభ పై కూడా ఆశలు పెట్టుకున్నారు ఆలీ. జగన్ అమరావతికి పిలిపించి మాట్లాడారు. తీరా ఆలి స్థాయికి చాలా తక్కువ అయిన ఓ సలహాదారు పోస్టు ఇచ్చి సరి పెట్టేశారు. ఆ సలహాదారు పోస్టుకు వచ్చే ఒక నెల జీతం.. ఆలీ చేసే ఒక ఎపిసోడ్ రెమ్యూనరేషన్‌కు సమానం.

దీనిని బట్టి ఆలీని జగన్ ఎంతలా వాడుకుని వదిలించుకున్నారో తెలుస్తోంది. చివరకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అయినా పోటీ చేయాలని ఆలీ అనుకున్నారు. గుంటూరు తూర్పు పై ఆశలు పెట్టుకున్నారు. జగన్ సీటు ఇవ్వలేదు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీకి భవిష్యత్తు ఉంటుందో.. లేదో.. కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికీ వైసీపీ అభిమానిగా ఇండస్ట్రీలో ముద్ర ఉంది. దీంతో తన సినిమా కెరీర్‌కు ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనుకున్నారో ఏమో.. ఆలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని ప్రకటించారు. అయితే ఇక్కడే ఆలీ కొన్ని అబద్ధాలు ఆడేశారు. తను ఎవరిని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. అయితే గతంలో ఆలీ.. పవన్ కళ్యాణ్‌ను వైసీపీ ట్రాప్ లో పడి గట్టిగా టార్గెట్ చేశారు. తనకు మంచి స్నేహితుడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి మరి.. ఆలీ, పవన్ పై రెచ్చిపోయారు.

నాకు ఆకలి వేస్తే చస్తాను తప్ప‌.. ఒకరి దగ్గరకు వెళ్లి అర్జించాను అని పవన్‌ను ఉద్దేశించి ఆలీ వ్యాఖ్యానించారు. పైగా తాను.. పవన్ పై అయినా పోటీకి సిద్ధం అని వైసిపికి 175 సీట్లు పక్కా అని కామెంట్ చేయడం విశేషం. పవన్ తనకు మిత్రుడే అయినా స్నేహం వేరు, రాజకీయాలు వేరు అని.. రాజకీయంగా తన మద్దతు జగన్‌కు అని ఆలీ అప్పుడు చెప్పక‌నే చెప్పేశారు. చివరకు ఆలీ తీరుతో పవన్ సైతం ఆలీ కుమార్తె పెళ్లికి ఆహ్వానించిన వెళ్లలేని పరిస్థితి అన్న ప్రచారం కూడా అప్పుడు జరిగింది. మరి ఆలీ ఇప్పుడు సాంప్రదాయిని.. సుప్పిని.. శుద్ధ పూసని.. అన్నట్టుగా కబుర్లు చెప్పడంతో పాటు పార్టీ ఓడిపోయాక తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పటం గమనార్హం. మరి పవన్ ఇప్పుడు ఆలీని దగ్గరకు రానిస్తాడా.. జనసైనికులు, టీడీపీ వాళ్ళు ఆలీ విషయంలో ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: