
మంత్రులుగా కొత్తవారికి ఛాన్స్.. బాబు ప్లాన్ ఏంటంటే?
•కేబినెట్‌లో కొత్త వారికి ఛాన్స్
•భావి నాయకత్వం పెంపొందేలా బాబు అడుగులు
•భవిష్యత్తులో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని బాబు ప్లాన్
అమరావతి - ఇండియా హెరాల్డ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తన మంత్రి వర్గంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఒక పక్క సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్‌లో అధిక స్థానాలు కేటాయించారు. అందులో 17 మంది మొదటిసారి మంత్రి పదవులు అందుకోవడం విశేషం. గతంలో మంత్రులుగా పనిచేసినవారు కొత్త కేబినెట్‌లో ఏడుగురే ఉన్నారు. బాబు అవకాశం ఇచ్చిన ఈ మంత్రుల్లో పది మంది తొలిసారి ఎన్నికైన వారు కావడం మరో విశేషం. వీరిలో పవన్ కల్యాణ్, వాసంశెట్టి సుభాష్, ఎం.రాంప్రసాద్‌రెడ్డి, టీజీ భరత్, సవిత, కొండపల్లి శ్రీనివాస్ ఇంకా సత్యకుమార్ చట్ట సభలకు మొదటిసారి ఎన్నికయ్యారు. లోకేశ్, కందుల దుర్గేశ్, గుమ్మిడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీలుగా చేశారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం.ఇక మరో 8 మంది మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినా పదవులు అందుకోవడం ఇదే మొదటిసారి. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవి కుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు గానీ.. మంత్రులు కాలేదు. నాదెండ్ల మనోహర్ అయితే ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. వీరంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రులయ్యారు. ఇక కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి ఇంకా లోకేశ్ గతంలోనూ మంత్రులుగా పనిచేశారు. ముఖ్యంగా ఆనం, కొలుసు గతంలో కాంగ్రెస్ మంత్రివర్గాల్లో పని చేశారు.
నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి భావి నాయకత్వాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా కొత్త తరానికి టీడీపీ అధినేత అవకాశం కల్పించి అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రయత్నంలో కొంతమంది సీనియర్లు అవకాశం కోల్పోయారు. కేశవ్, గొట్టిపాటి రవికి చోటు దక్కడంతో అదే సామాజిక వర్గంలో సీనియర్ బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కలేదు. శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి యువ నేత సుభాష్ కు చోటు దక్కడంతో సీనియర్ నేత పితాని సత్యనారాయణ ఛాన్స్ కోల్పోయారు. యాదవ సామాజిక వర్గం నుంచి సుదీర్ఘ కాలంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి మంత్రివర్గంలో ఛాన్స్ వస్తోంది. అయితే ఈసారి ఆ వర్గం నుంచి సత్య కుమార్, కొలుసు పార్థసారథికి చాన్సు రావడంతో యనమలకు అవకాశం దక్కలేదు. కొప్పుల వెలమ నుంచి కేంద్రంలో రామ్మోహన్‌నాయుడు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వడంతో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఈసారి అవకాశం రాలేదు. అయితే ఇలా కొత్తవారికి ఛాన్స్ మంత్రులుగా ఛాన్స్ ఇవ్వడం వల్లనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు ప్లాన్. పైగా ఈ కొత్త వాళ్ళు కూడా ప్రతిభావంతులు. బాగా చదువుకున్న వారు. ఏదైన సమస్య వస్తే ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా, పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి కావాలాన్నా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి. పార్టీలో సీనియర్లకు జూనియర్లకు అందరికి మంత్రులుగా అనుభవం వస్తే రాష్ట్రం ముందుకు వెళుతుంది అనేది బాబు ప్లాన్. మరి బాబు కొత్త మంత్రులు ఎలా పని చేస్తారో చూడాలి.