కోన‌సీమ‌లో కూట‌మి జోరు ముందు జ‌గ‌న్ పార్టీ నిల‌బ‌డుతుందా ?

RAMAKRISHNA S.S.
- అమ‌లాపురం ఎంపీ, రాజోలు, గ‌న్న‌వ‌రంలో క్యాండెట్ల‌ను మార్చిన వైసీపీ
- రాజోలు, గ‌న్న‌వ‌రంలో జ‌న‌సేన‌, అమ‌లాపురంలో టీడీపీ పోటీ
- అమ‌లాపురం పార్ల‌మెంటులో కూట‌మి బ‌లం బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
కోనసీమలో ఉన్న అమలాపురం పార్లమెంటు మూడు ఎస్సి రిజర్వ్ సెగ్మెంట్లలో కూట‌మి జోరు ముందు వైసీపీ తట్టుకుని ఎంతవరకు పోటీ ఇస్తుంది ? అన్నది చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభావం చాలా బలంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో అమలాపురం పార్లమెంటు సీటు ఒక‌టి. ఈ పార్లమెంటు పరిధిలో అమలాపురం, రాజోలు, టీ గన్నవరం ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. గత ఎన్నికలలో అమలాపురం పార్లమెంటు సీటుతో పాటు గన్నవరం, అమలాపురంలో వైసీపీ విజయం సాధిస్తే రాజోలులో మాత్రం జనసేన గెలిచింది. రాష్ట్ర మొత్తం మీద జనసేన గెలిచిన ఏకైక సీటు రాజోలు మాత్రమే.

అయితే ఈసారి పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబును పక్కన పెట్టిన జగన్.. రాజోలు లోను జనసేన నుంచి పార్టీలోకి వచ్చిన రాపాక వరప్రసాదరావుకు అమలాపురం పార్లమెంటు సీటు ఇచ్చి.. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లప‌ల్లి సూర్యరావుకు రాజోలు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అమలాపురంలో ఉన్న మంత్రి విశ్వరూప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. జగన్ మాత్రం ఆయనపై మరోసారి నమ్మకం ఉంచారు.

ఇక పొత్తులో భాగంగా అమలాపురం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ తరఫున గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయిన గంటి హరీష్ మాధుర్ మరోసారి పోటీ చేస్తుండగా.. జనసేన గన్నవరం, రాజోలు స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయిన‌ బత్తుల ఆనందరావు మరోసారి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో ఎంపీగా ఓడిపోయిన హరీష్ మాధుర్‌ పై ప్రజల్లో చాలా సానుభూతి కనిపిస్తోంది.

ఈసారి బాలయోగి వారసుడిని పార్లమెంటుకు పంపాలన్న‌ ఆత్రుత పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలలో ఎక్కువగా కనిపిస్తోంది. మాజీ మంత్రి సూర్యారావు లాంటి వారు చివరి క్షణంలో పార్టీ మారి వైసీపీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. అయితే జనసేన నుంచి రాజోలు, గన్నవరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అంత రాజకీయ అనుభవం లేని వారు కావటం.. ఒకంత మైనస్ అయినా.. కూటమి ప్రభావంతో జనసేన, టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అంచనాలు అయితే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: