ఏపి: సినీ ప్రముఖులు ఏపీ రాజకీయాల్లో వేలిపెట్టకపోవడానికి కారణం ఇదేనా?

Suma Kallamadi
ఎలక్షన్ కి దగ్గర పడుతుండడంతో ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నాయి. అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామో చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇపుడు ఆంధ్రా ఎన్నికల ప్రచారాల్లో సినీ ప్రముఖులు ఎక్కడా కనిపించక పోవడం కొసమెరుపు. గత ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన ఎంతోమంది వివిధ పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం మనకు తెల్సిందే. ఇప్పుడు మాత్రం సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరు పెద్దగా ఏపీ రాజకీయాలపై ఆసక్తి కనబరచక పోవడం మనం చూడవచ్చు.
2019 ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే సినీ రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీ సైతం సినీ పరిశ్రమకు చెందిన వారిని దూరం పెట్టడం గమనించవచ్చు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి టికెట్లు దొరికేవి. ఈ సారి అయితే ఏ పార్టీ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారికి టికెట్లు ఇవ్వలేదు. ఒకసారి పరిశీలిస్తే టిడిపి నుంచి బాలకృష్ణ, వైసీపీ నుంచి రోజా, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మినహా, మిగతా ఎక్కడా ఆ రంగానికి చెందినవారు కనబడిన దాఖలాలు లేవు. కనీసం ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూడా అంతగా ఆసక్తి చూపించక పోవడం కొసమెరుపు.
సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన సంగతి విదితమే. జనసేన పార్టీకి అధినేత అయిన పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో కొంతమంది ఆయన వైపు మొగ్గుచూపినప్పటికీ ఆయనే రాజకీయాలకు దూరంగా ఉండమని చెప్పినట్టు సమాచారం. ఇక గత ఎన్నికల్లో మెజారిటీ సినీ ప్రముఖులు... ఆలీ, పోసాని కృష్ణ మురళి, మోహన్ బాబు, పృద్వీ, భానుచందర్ ఇలా చాలామంది అటువైపు మొగ్గు చూపారు. కాగా ప్రస్తుతం తరుణంలో వారు కూడా అంతగా రాజకీయాలవైపు ఆసక్తిగా లేరని వినికిడి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, సినీ పరిశ్రమ హైదరాబాదులోనే కొనసాగుతూ ఉండడం వంటి కారణాలతో కూడా ఏపీ రాజకీయాలపై సినీ ప్రముఖుల ఎవరూ ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: