ఏపీ: జనంలోకి వెళ్తున్న జగన్.. బస్సు యాత్ర నేటి షెడ్యూల్ ఇదే..!?

Suma Kallamadi
లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో మే 13న జరగనున్నాయి. దీంతో సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ జనంలోకి వెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించి, యాత్రను ఆయన ప్రారంభించారు. అధికారం చేపట్టాక వైఎస్ జగన్ జనంలోకి రాలేదనే విమర్శలను ప్రతిపక్షాలు ఎక్కుపెట్టాయి. ఎన్నికలు రావడంతో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ తరుణంలో ఈ బస్సు యాత్రం ప్రస్తుతం 5వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని సంజీవపురంలో ఆయన గత రాత్రి బస చేశారు. అక్కడి నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. కదిరిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొనున్నారు. రాత్రికి చీకటిమనిపల్లెలో జగన్ బస చేయనున్నారు. ఈ బస్సు యాత్ర కోసం ఆయా గ్రామాల్లో వైసీపీ నేతలు విస్తృతంగా ఏర్పాటు చేశారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 22 జిల్లాలను జగన్ ఈ బస్సు యాత్ర ద్వారా కవర్ చేయనున్నారు, ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 171 నియోజకవర్గాల గుండా సీఎం నేతృత్వంలో యాత్ర సాగనుంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పి, ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ యాత్రను ఆ పార్టీ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం డిబిటి ద్వారా రూ. 2.70 లక్షల కోట్లు, నాన్-డిబిటి రూపంలో రూ. 1.79 లక్షల కోట్లు పంపిణీ చేసిందని, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
అంతేకాకుండా సీఎం జగన్ పరదాలు కట్టుకుని యాత్రలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఇప్పటివరకు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలను పటాపంచలు చేసేలా జగన్ నేరుగా ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టారు. తానే స్వయంగా బస్సు యాత్ర చేపట్టి, ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఎన్నికల్లో తమ లక్ష్యమైన 175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలిచేందుకు ఈ యాత్రను ప్రారంభించారు. ప్రజలతో మమేకం అవుతూ, తమ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను వివరిస్తున్నారు. అయితే ఈ యాత్ర ఎంత వరకు ఆ పార్టీకి లాభిస్తుందో ఎన్నికల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: