కోస్తా : పెద్దారెడ్డి వైసీపీకి షాకిస్తున్నారా ?

Vijaya

రెడ్డి సామాజికవర్గం నేతలు అన్నీ జిల్లాల్లోను ఉంటారు. కాని నెల్లూరు జిల్లాలోని రెడ్డి నేతలను మాత్రమే నెల్లూరు పెద్దారెడ్లంటారు. సినిమా డైలాగుల ప్రభావమో ఏమో. ఇపుడిదంతా ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్లు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి తొందరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ప్రస్తుతం వేమిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు లోక్ సభ ఎంపీ.



పోయిన ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో చంద్రబాబునాయుడుపై పెరిగిపోయిన వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గాలికి తోడు వేమిరెడ్డి, ఆదాల ఆర్ధిక అండదండలు కూడా కారణమని చెప్పాలి. ఇద్దరు రెడ్లు ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ అభ్యర్ధులకు పూర్తిస్ధాయి మద్దతుగా నిలబటంతోనే టీడీపీ ఘోరఓటమి సాధ్యమైంది. అప్పటినుండి ఇద్దరు బలంగా వేళ్ళూనుకున్నారు. మారిన పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో ఆదాల ఎంఎల్ఏగా పోటీచేయాలని అనుకున్నారు.



అందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి నిష్క్రమణతో అవకాశం వచ్చింది. వెంటనే ఆదాలతో మాట్లాడిన జగన్ ఎంపీని నెల్లూరు ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఫైనల్ చేశారు. ఆదాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు ఎల్లోమీడియాతో పాటు ఇతర మీడియా కూడా ప్రచారం మొదలుపెట్టింది. తాను టీడీపీలో చేరటంలేదని ఆదాల చెప్పినా ప్రచారం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఇక వేమిరెడ్డి విషయం చూస్తే ఈయన పార్టీకి ఎంతచేశారో జగన్ కూడా ఈయనను  అంతే బాగా చూసుకున్నారు. ఈయన భార్య ప్రశాంతికి టీటీడీ బోర్డులో సభ్యురాలిగా అవకాశమిచ్చారు.



రాబోయే ఎన్నికల్లో లోక్ సభకు పోటీచేయాలని అనుకుంటే వెంటనే నెల్లూరు పార్లమెంటు సభ్యునిగానే ఫైనల్ చేశారు. నెల్లూరు సిటి ఎంఎల్ఎ అభ్యర్ధి అనీల్ కుమార్ యాదవ్ ను మార్చాలని వేమిరెడ్డి పట్టుబట్టారు. అందుకు జగన్ అంగీకరించి అనీల్ ప్లేసులో ఖలీల్ ను నియమించారు. ఖలీల్ ను కూడా మార్చాల్సిందే అని వేమిరెడ్డి పట్టుబట్టారు. అందుకు జగన్ అంగీకరించలేదు. దాంతో మనస్తాపంతో పార్టీకి దూరమయ్యారు. మంగళవారం రాత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయ్యారని సమాచారం. సో, ఇద్దరు పెద్దారెడ్లు ఈనెల 18న టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: