అమరావతి : జూనియర్ అంటేనే ఉలిక్కిపడుతున్నారా ?

Vijaya

ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలుగుదేశంపార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాల్లో అనేక మైనస్ పాయింట్లు కనబడుతున్నాయి. అలాంటి మైనస్ పాయింట్లలో ఒకటి ఏమిటంటే జూనియర్ దెబ్బ కలవరపెట్టేస్తోంది. టీడీపీ మీటింగులో ఎక్కడ జరుగుతున్నా జూనియర్ కు మద్దతుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కనబడుతున్నాయి. ఈ వ్యవహారం చంద్రబాబునాయుడు పర్యటన కుప్పంతో మొదలైంది. దాదాపు రెండేళ్ళ క్రితం కుప్పంలో చంద్రబాబు పర్యటించినపుడు భారీఎత్తున జూనియర్ మద్దతుదారులు హాజరై రచ్చరచ్చచేశారు.



అప్పటి నుండి చంద్రబాబు, లోకేష్ పాల్గొనే బహిరంగసభలు ఎక్కడ జరిగినా జూనియర్ అభిమానులు వీళ్ళని వెంటాడుతున్నారు. మొన్నటి గుడివాడ సభలో ఇదే విషయమై జూనియర్ అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు పెద్ద గొడవ కూడా అయ్యింది. టీడీపీ బహిరంగసభలు జరుగుతున్నపుడు జూనియర్ అభిమానులు జూనియర్ ను సీఎం సీఎం అంటు నానా గోలచేస్తున్నారు. పైగా సభలు జరిగే ఊర్లలో మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేస్తున్నారు.



ఇపుడు సమస్య ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున జూనియర్ ప్రచారం చేస్తారా ? లేకపోతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా అన్నదే అర్ధంకాక టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్, బాలయ్య నూరుశాతం జూనియర్ను వ్యతిరేకిస్తున్నారు. అవకాశం వచ్చినపుడల్లా ఏదోరూపంలో జూనియర్ను అవమానిస్తున్నారు. ఒకరకంగా జూనియర్ కు వీళ్ళపై మండిపోతోంది. దీనికి అదనంగా ఏమిటంటే చంద్రబాబు, లోకేష్, బాలయ్యను పూర్తిగా వ్యతిరేకించే కొడాలినాని, వల్లభనేని వంశీకి జూనియర్ అత్యంత సన్నిహితుడు.



అందుకనే రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా జూనియర్ టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటమో లేకపోతే సందేశం పంపించటమో చేస్తారనే టెన్షన్ వీళ్ళల్లో పెరిగిపోతోంది. అసలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమస్యలు మొదలైపోయాయి. పొత్తు అనుకున్నట్లుగా సాగటంలేదు. చంద్రబాబు, పవన్ పంతాలకు పోయి ఎవరిపాటికి వాళ్ళు అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. దాంతో రెండుపార్టీల్లోను గందరగోళం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ సమయంలో జూనియర్ మౌనం కూడా వీళ్ళని కలవరపెట్టేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: