గోదావరి : జనసేన గుట్టును చేగొండి బయటపెట్టారా ?
మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. కాపు ప్రముఖుల్లో ఒకరుగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ మద్దతుదారుగా బాగా పాపులర్. చేగొండి జీవిత ఆశయం ఏమిటంటే పవన్ను ముఖ్యమంత్రిగా చూడటం. ఈ విషయాన్ని చేగొండి బహిరంగంగానే చాలాసార్లు చెప్పారు. అయితే ఆయన విడుదల చేసిన తాజా లేఖ అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా పార్టీలోని లోగుట్టును బయటపెట్టినట్లయ్యింది.
ఇంతకీ చేగొండి లేఖ ద్వారా బయటపడింది ఏమిటంటే అధినేత పవన్ రూటు, జనసైనికుల రూటు సపరేటని. మామూలుగా ఏ పార్టీలో అయినా అధినేత ఆలోచనల ప్రకారమే నేతలు, క్యాడర్, అభిమానులు నడుచుకుంటుంటారు. కానీ జనసేనలో మాత్రం పవన్ ఆలోచనలకు, క్యాడర్మ ఆలోచనలకు మధ్య చాలా వైరుధ్యాలున్నట్లు లేఖలో చేగొండి స్పష్టంగా చెప్పారు. ఇంతకీ ఆయన చెప్పిందేమిటంటే ఓట్లు కావాలని పవన్ అంటుంటే జనసైనికులేమో అధికారం కావాలంటున్నారట. పవనేమో జేజేలు, చప్పట్లు కాదు ఓట్లు కావాలని అంటున్నారట.
అయితే జనసైనికులు మాత్రం ఓట్లు సరే అధికారం మాటేమిటని అడుగుతున్నారట. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటున్నారట. అధికారం వస్తుందని నమ్మిస్తేనే ఓట్లు వస్తాయని జనసైనికులు చెబుతున్నారట. అధికారం కాదు రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని పవన్ అంటున్నారట. అధికారం చేజిక్కకుండా ప్రజా శ్రేయస్సును సాధించటం ఎలాగని పవన్ను అడుగుతున్నారట. పవన్ చెబుతున్న సుభాషితాలే తెలంగాణా ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లని చేగొండి బాగా దెప్పిపొడిచారు.
బీజేపీతో కలిసి తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీచేయటమే పవన్ చేసిన పెద్ద సాహసంగా చేగొండి అభివర్ణించారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిసీ బీజేపీతో కలిసి పవన్ ఎందుకు ఎన్నికలకు వెళ్ళారని చేగొండి ప్రశ్నించారు. అధికారంలోకి రాదని తెలిసిన తర్వాత కూడా జనాలు బీజేపీ+జనసేనకు ఎందుకు ఓట్లేస్తారని మాజీ ఎంపీ చేగొండి సూటిగా నిలదీశారు. తెలంగాణా, ఏపీకి మధ్య తేడాను పవన్ తెలుసుకోలేకపోయారంటు ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావటం ఖాయమని నమ్మిస్తేనే జనాలు ఓట్లేస్తారని చేగొండి తేల్చేశారు.