అమరావతి : మ్యానిఫెస్టోపై జోగయ్య షాక్
ఉమ్మడి మ్యానిఫెస్టో చేగొండి హరిరామజోగయ్యకే నచ్చలేదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా రెండుపార్టీలు కలిపి ఉమ్మడి మ్యానిఫెస్టోను రిలీజ్ చేయటంపై కసరత్తులు మొదలుపెట్టాయి. మొదటగా 11 హామీలతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించాయి. ఇందులో టీడీపీ ప్రతిపాదించిన 6 హామీలు, జనసేన ఇచ్చిన హామీలు ఐదున్నాయి. మొత్తం కలిపి 11 హామలతో మినీ మ్యానిఫెస్టోను రిలీజ్ చేసినట్లు సీనియర్ తమ్ముడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు.
ఈ మినీ మ్యానిఫెస్టో కోసం తాము చాలా కష్టపడినట్లు చెప్పుకున్నారు. పూర్తిస్ధాయి మ్యానిఫెస్టో కోసం వివిధ రంగాల్లోని నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఇంత లావుగా చెప్పుకుని రిలీజ్ చేసిన మినీమ్యానిఫెస్టో మాజీ ఎంపీ జోగయ్యకు ఏమాత్రం నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కే కాదు జోగయ్యకు కూడా అంతే మంటుంది. కాకపోతే 89 ఏళ్ళ వయసులో ఉన్నారు కాబట్టి జోగయ్య యాక్టివ్ గా తిరగటంలేదంతే. అందుకని ఇంట్లోనే కూర్చునే ప్రకటనలు జారీచేస్తుంటారు.
తాజాగా మినీ మ్యానిఫెస్టోపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఐదు కోట్లమందిని మెప్పించేలాగ మ్యానిఫెస్టో లేదన్నారు. ఉమ్మడి మ్యానిఫెస్టో జనరంజకంగా ఏమాత్రం లేదని తేల్చేశారు. ఐదు కోట్ల జనాల ఆకాంక్షల మేరకు, జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలకు ధీటుగా మినీ మ్యానిఫెస్టో లేదని కుండబద్దలు కొట్టారు. జనాలను ఆకర్షించేలా మ్యానిఫెస్టో లేకపోతే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని అసంతృప్తిని వ్యక్తంచేశారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ను ఇంతలా ధ్వేషిస్తు, పవన్ను కీర్తించే జోగయ్యకే మినీమ్యానిఫెస్టో నచ్చలేదు. జోగయ్యకే నచ్చని మ్యానిఫెస్టో ఇక మిగిలిన జనాలకు ఏమి నచ్చుతుంది ? పైగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమపథకాలకు మించి మ్యానిఫెస్టో ఉండాలని జోగయ్య చెప్పారు. నిజానికి ఆ స్ధాయిలో మ్యానిఫెస్టో రెడీచేయటం రెండుపార్టీలకు సాధ్యమేనా ? ఇంతకాలం ఏపీని జగన్ శ్రీలంక లాగ తయారు చేస్తున్నారని, ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని చంద్రబాబు, పవన్ , ఎల్లోమీడియా ఆరోపణలు, ఏడుపుల గురించి జనాలు నిలదీస్తే ఏమని సమాధానాలు చెప్పగలరు ?