అమరావతి : ఎటూ కాకుండా అయిపోయారా ?

Vijaya


నందమూరి బాలకృష్ణను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య ఇపుడు అటు ఏపీకి ఇటు తెలంగాణాకు కాకుండాపోయారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత బాలయ్య జిల్లాలు పర్యటించాలని అనుకున్నారు. పార్టీని తాను ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. అయితే తర్వాత ఏమైందో ఏమో అసలా ఊసే లేకుండాపోయింది. భువనేశ్వరి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిజం గెలవాలి అనే పేరుతో బస్సుయాత్ర చేశారు. అయితే ఆ యాత్రలో సోదరుడు బాలయ్యను కలుపుకోలేదు.



టీడీపీ+జనసేన పార్టీల నేతల్లో ఉత్సాహం నింపడం కోసం ఉమ్మడి సమన్వయ కమిటి పేరుతో 14 మందిని నియమించారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నా తనను ఎవరు పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే చంద్రబాబు జైలుకు వెళ్ళిన కొత్తల్లో చంద్రబాబు సీటులో కూర్చుని బాలయ్య నేతలతో మీటింగ్ పెట్టడమే. పార్టీ అధ్యక్షుడి  కుర్చీలో కూర్చుని అందరితో మీటింగ్ పెట్టినపుడే తమ్ముళ్ళందరు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు కుర్చీలో కూర్చోవద్దని చెప్పినా బాలయ్య వినలేదట.



సరే, ఏపీలో తనను ముందుకు వెళ్ళనియ్యరని బాలయ్యకు కూడా అర్ధమైపోయినట్లుంది. అందుకనే సీన్ తెలంగాణాకు షిఫ్ట్ చేశారు. తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తదితరులతో సమావేశమయ్యారు. టీడీపీ పోటీచేసే అన్నీ నియోజకవర్గాల్లోను తాను ప్రచారం చేస్తానన్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలంగాణాలో అసలు టీడీపీ పోటీనే చేయటంలేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం బాలయ్యపై సీనియర్ తమ్ముడు యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రబాబు దగ్గర ఫిర్యాదు చేశారట. చంద్రబాబు కుర్చీలో కూర్చోవటం, జిల్లాల పర్యటనకు రెడీ అవటం, తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తాననే ఏకపక్ష ప్రకటనలను వివరించారట.



దాంతో చంద్రబాబు అలర్టయ్యారని అంటున్నారు. అందుకనే అర్జంటుగా భార్య భువనేశ్వరితో యాత్రలు చేయించారు. అలాగే అనేక కారణాలతో తెలంగాణాలో పార్టీని  ఎన్నికలకు దూరంగా ఉంచేశారు. పార్టీలో జరుగుతున్నది చూసిన తర్వాత  బాలయ్యకు జ్ఙానోదయం అయినట్లుంది. అందుకనే చంద్రబాబు విడుదల సందర్భంగా జైలు దగ్గర కనిపించిన బాలయ్య మళ్ళీ ఇంతవరకు ఎక్కడా కనబడలేదు. లోకేష్ నిర్వహించిన పార్టీ మీటింగుల్లో కానీ రెండుపార్టీల సమన్వయ సమావేశంలో కూడా కనబడలేదు. చివరకు బాలయ్య పరిస్ధితి ఏమిటో కాలమే నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: