అమరావతి : జనసేన ఎత్తిపోయే పార్టీయేనా ?
సోషల్ మీడియాలో మూడురోజులుగా ఒక విషయం బాగా చక్కర్లు కొడుతోంది. ఆ విషయం నిజమేనా అన్నట్లుగా ఉంది చూస్తుంటే. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులంతా తెలుగుదేశంపార్టీ సింబల్ సైకిల్ మీదే పోటీచేయబోతున్నారట. ఎందుకంటే జనసేనకు ఫిక్సుడ్ సింబల్ అంటు లేదుకాబట్టే. మరి ఫిక్సుడు సింబల్ లేని జనసేన ఎన్నికల సింబల్ ఉన్న టీడీపీ రెండు కలిసి పొత్తుగా ఎలా పోటీచేద్దామని అనుకుంటున్నాయో అర్ధంకావటంలేదు.
సరిగ్గా ఈ విషయంమీదే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఓ విషయం. నాదెండ్ల మనోహర్ సంతకంతో ఒక ప్రెస్ నోట్ విడులైనట్లుంది. అందులో రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేయబోయే అభ్యర్ధులందరు టీడీపీ గుర్తయిన సైకిల్ గుర్తుమీదే పోటీచేయాల్సుంటుందని నాదెండ్ల చెప్పినట్లుంది. ఇది ఎంతవరకు నిజమనే విషయంలో చాలా అనుమానలున్నాయి. అయితే పవన్ మాట్లాడిన మాటలు చూస్తుంటే నాదెండ్ల పేరుతో చక్కర్లుకొడుతున్న ప్రెస్ నోట్ నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కూడా బాగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే జనసేన తరపున పోటీచేయబోయే అభ్యర్ధులు తమ నియోజకవర్గాల్లో తలా ఒక గుర్తుపై పోటీచేయాల్సుంటుంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో గుర్తుమీద పోటీచేస్తున్న అభ్యర్ధులను గెలిపించమని ప్రచారం చేయటం పవన్, చంద్రబాబు ఇద్దరికీ కష్టమే. ఒకవైపు సైకిల్ గుర్తు మరోవైపు రకరకాల గుర్తులతో పోటీచేస్తున్న అభ్యర్ధులకు ప్రచారం చేయటం భలేగా ఉంటుంది.
ఇదంతా చూస్తుంటే తొందరలోనే జనసేన ఎత్తిపోయే పార్టీనే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతున్నా కామన్ సింబలే సంపాదించుకోలేకపోయారంటే పవన్ కు రాజకీయాలంటే ఎంత కమిట్మెంట్ ఉందో అర్ధమైపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు మీద ప్రేమకన్నా జగన్మోహన్ రెడ్డిపైన ధ్వేషమే ఎక్కువుంది పవన్లో. అందుకనే పార్టీని సైతం ఫణంగా పెట్టడానికి పవన్ సిద్ధమైపోయారు. మొత్తానికి జనసేన భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో తేలిపోవటం ఖాయం.