అమరావతి : రుషికొండ మీదే పవన్ కు ఎందుకింత కసి ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో లాజిక్కు మిస్సవుతోంది. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్లో కేవలం ఉన్నాదం, కసి, ధ్వేషభావం మాత్రమే కనబడుతోంది. ఎందుకంటే ఏ అంశాలమీదైతే ఇపుడు జగన్ను పదేపదే టార్గెట్ చేస్తున్నారో అవే అంశాలు చంద్రబాబునాయుడుకు కూడా వర్తిస్తాయి. ఇపుడు ఏ విషయాలమీదైతే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో అవే చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. కానీ అప్పట్లో పవన్ వాటిని పట్టించుకోలేదు. కానీ ఇపుడు జగన్ మీద మాత్రం రెచ్చిపోతున్నారు.



ఇక్కడే జగన్ అంటే పవన్లో ఎంత కసి పేరుకుపోయిందో అర్ధమైపోతోంది. ఉదాహరణకు వైజాగ్ లో రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలనే తీసుకుందాం. మామూలుగా ఏ ప్రభుత్వంలో అయినా కొండల మీద కూడా నిర్మాణాలు జరుగుతునే ఉంటాయి. ఇందులో భాగంగానే రుషికొండ మీద గతంలో కూడా నిర్మాణాలు జరిగాయి. పెద్ద పెద్ద ఐటి కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్ధలు ఏకంగా అపార్టమెంట్లనే కట్టేశాయి. చాలామంది పెద్ద పెద్ద బంగళాలను నిర్మించుకున్నారు.



హైదరాబాద్ లో చిరంజీవి, పవన్ లాంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు కొండలను తొలిచే భవనాలను నిర్మించుకున్నారు. ఇపుడు కూడా అలాగే కడుతున్నారు. కళ్ళముందు కొండలను తొలిచేసి భవనాలను, ఆసుపత్రులను నిర్మించుకుంటున్నది పవన్ కు కనబడటంలేదా ? కళ్ళముందు జరుగుతున్నది  చూస్తూ కూడా కేవలం రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలను మాత్రమే పవన్ ఎందుకని టార్గెట్ చేస్తున్నారు ?



ఎందుకంటే  జగన్ అమరావతి నుండి విశాఖపట్నంకు మారటం చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు ఏమాత్రం ఇష్టంలేదు.  కోర్టుల్లో కేసులు వేసి మూడురాజధానులను అడ్డుకున్నది ఇందుకనే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ వచ్చి వైజాగ్ లో కూర్చుంటానంటే  వీళ్ళు ఏరూపంలోను అడ్డుకోలేరు.  జగన్ను ఆపలేకపోతున్నామన్న అక్కసు వీళ్ళల్లో పెరిగిపోతోంది. అందుకనే సంబంధంలేకపోయినా రుషికొండను జగన్ దోచేస్తున్నాడని, ఉత్తరాంధ్రను దోచుకునేస్తాడని పవన్ గోల గోల చేస్తున్నది. అయినా ఎవరెందుకు మాట్లాడుతున్నారో జనాలకు అంతమాత్రం తెలీకుండానే ఉంటుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: