ఉత్తరాంధ్ర : ఇంత కాలమైనా అదే ఏడుపా ?
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గాజువాకలో స్పీచు విన్నతర్వాత చాలామందికి అనిపించిందిదే. ఎంతకాలమైనా ‘నన్ను ఎందుకు ఓడగొట్టారు..జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ? ఇక్కడ ఎంపీని గెలిపించుంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపేసుండేవాళ్ళం..నన్ను ఓడించటానికి నేను చేసిన తప్పేంటి ? నరేంద్రమోడీ నాకు బాగా సన్నిహితులు,. అమిత్ షా తో నాకు బాగా పరిచయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే’. పవన్ ప్రసంగం అంతా ఇదే తీరున జరిగింది.
ఎంతకాలమైనా గాజువాకలో తాను ఓడిపోయానన్న బాధ పవన్ను విడిచిపెట్టలేదనే అనిపిస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజమన్న విషయం పవన్ కు ఇంకా అర్ధమైనట్లులేదు. ఏ భ్రమలో ఉన్నారంటే తాను ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తినని అనుకుంటున్నారు. అలాంటిది తనను ఎంఎల్ఏగా ఓడించి గాజువాక జనాలు చాలా తప్పు చేశారనే పవన్ ఫిక్సయిపోయారు. తనను జనాలు ఎందుకు ఓడించారు అనే విశ్లేషణ మానేసి, ప్రజలు తప్పుచేశారని తీర్మానించేశారు.
పవన్ మాటలు విన్నతర్వాత ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అనుమానంగా ఉంది. మొదటిది తాను పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోవటం అయితే రెండోది తాను అత్యంత ఎక్కువగా ధ్వేషించే జగన్ అఖండ మెజారిటితో ముఖ్యమంత్రి కావటమే. రెండు కూడా పవన్ను మానసికంగా బాగా దెబ్బతీసినట్లున్నాయి. పురాణాల్లో హిరణ్యకశిపుడికి శ్రీహరి అంటే ఎంత ధ్వేషభావం నిండిపోయుంటుందో అదే స్ధాయిలో జగన్ అంటే పవన్ కూడా అంతగా మండిపోతున్నారు.
దీనికి కారణం ఏమిటంటే ఏమీలేదు వడ్లగింజలో బియ్యంగింజంతే. పవన్లో చిత్తశుద్ది ఉండుంటే జనాలు జగన్ను ఎందుకు గెలిపించారు ? తనను ఎందుకు ఓడించారు అనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడో దొరికేదే. పాదయాత్ర కానీండి, ప్రత్యేకహోదా కోసం తన ఎంపీలతో రాజీనామాలు చేయించటం, రాష్ట్రమంతా ఆందోళనలు చేయటం, హోదా కోసం ఏపీ భవన్లో ఎంపీలు నిరాహాదరదీక్షలు చేయటం, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం లాంటి చర్యలకు చంద్రబాబునాయుడు మీద పెరిగిపోయిన వ్యతిరేకత కలిసొచ్చి వైసీపీకి 151 సీట్లొచ్చాయి. ఇవన్నీ ఆలోచించకుండా జగన్ను ఎందుకు గెలిపించారు ? తనను ఎందుకు ఓడించారని ఇన్ని సంవత్సరాలైనా అదే ఏడుపైతే జనాలు ఒప్పుకుంటారా ?