అమరావతి : ప్రాజెక్టును నాశనంచేసింది ఎవరు ?
తన హయాంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా నాశనం చేసేసిన చంద్రబాబునాయుడు ఇపుడు దొంగేడుపులు ఏడుస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శనకోసం యుద్ధభేరి అనే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రాజెక్టులను సందర్శించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతు పోలవరం ప్రాజెక్టును చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయన్నారు. ఎందుకంటే ప్రాజెక్టు దుస్ధితిని చూసి తట్టుకోలేకపోతున్నారట.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రాజెక్టును నాశనం చేసేసిందని గోల చేస్తున్నారు. దానికి ఎల్లోమీడియా భజన చేస్తు పెద్ద పెద్ద హెడ్డింగులతో బ్యానర్ కథనాలను అచ్చేసింది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును నాశనంచేసిందే చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం అసలు ప్రాజెక్టును నిర్మించాల్సింది కేంద్రప్రభుత్వమే. అలాంటి పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తికోసమే చంద్రబాబు బలవంతంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అక్కడినుండే మొదలైంది దరిద్రమంతా.
అప్పటివరకు ప్రాజెక్టు కాంట్రాక్టర్ గా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంస్ధ ట్రాన్స్ ట్రాయ్ కి పనులను రద్దుచేసి నవయుగకు అప్పగించారు. నవయుగ సంస్ధ ఎవరిదంటే ఎల్లోమీడియా యాజమాన్యానికి దగ్గరి బంధువులది. ప్రాజెక్టులో జరిగిన పనులు తక్కువ చేసుకున్న ప్రచారం ఎక్కువ. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రంవాల్ నిర్మించారు. దాంతో వర్షాల వల్ల వరదలు వచ్చి వరద దెబ్బకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.
దీనికి బాధ్యుడు చంద్రబాబు కాదా ? కాఫర్ డ్యామ్ నిర్మించకుండా ముందు డయాఫ్రం వాల్ ఎలా నిర్మించింది కాంట్రాక్టు సంస్ధ ? అందుకు చంద్రబాబు ఎలా ఒప్పుకున్నారు ? అప్పుడు కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ సరిచేయటానికి ఇపుడు జగన్ ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. దీనివల్ల రు. 2 వేల కోట్లు నష్టం, సమయం వృధా కూడా అయ్యింది. దీనికి చంద్రబాబు ఇప్పటివరకు సమాధానం చెప్పట్లేదు. ఇక తన హయాంలో చంద్రబాబు పునరావాసం మాటే ఎత్తలేదు. అంటే ఇపుడు ప్రాజెక్టు దుస్ధితికి స్వయంగా చంద్రబాబే కారణం. కానీ ఆ విషయం ఒప్పుకోకుండా ఎల్లోమీడియా మద్దతుతో దొంగేడుపులేడుస్తున్నారు.