అమరావతి : ఆడోళ్ళని పార్టీలే రోడ్డున పడేస్తున్నాయా ?
ఉరిమి ఉరిమి మంగళంమీద పడిందనే సామెతలాగ తయారైపోయింది ఏపీ పాలిటిక్స్ వ్యవహారం. అధినేతల మీద ఆరోపణలు, విమర్శల స్ధాయి దాటిపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళమీద సోషల్ మీడియాలో అభిమానులు రెచ్చిపోతున్నారు. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ అని మినహాయింపులేదు ప్రతిపార్టీది తప్పుంది. ఇపుడిదంతా ఎందుకంటే జనసేన అధినేత తన భార్య అన్నా లెజినోవాను రోడ్డుమీదకు లాగటంపై పవన్ కల్యాణ్ కొందరికి లీగల్ నోటీసులు జారీచేశారు.
సరే దీనివల్ల ఏమవుతుందన్నది పక్కనపెడితే అనవసరమైన రాద్దాంతం జరుగుతోందన్నది వాస్తవం. సమస్య ఎక్కడుందంటే చంద్రబాబునాయుడు, పవన్లోనే ఉంది. జగన్ అంటే వాళ్ళల్లో పేరుకుపోయిన ఏహ్యభావంతో తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలను రోడ్డుమీదకు లాగారు. అలాగే టీడీపీ నేతలు ఒకఅడుగు ముందుకేసి జగన్ భార్య భారతిపైన లిక్కర్ స్కామ్, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అనుచిత వ్యాఖ్యలుచేశారు. దాంతో వైసీపీలోని మహిళా నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు కోడలు బ్రాహ్మణి మీద ఆరోపణలు చేశారు.
భారతి మీద టీడీపీకి చెందిన స్వాతిరెడ్డి@ స్వాతి చౌధరి (పద్మశాలి అమ్మాయి) భారతి మీద చాలా అసభ్యమైన పోస్టులు పెడితే దాన్ని చంద్రబాబు ఎంకరేజ్ చేశారు. స్వాతి వెనుకబడిన తరగతుల అమ్మాయని చంద్రబాబే చెప్పారు. భారతి మీద స్వాతి పోస్టులు పెట్టినందుకు జగన్ అభిమానులు ఆ అమ్మాయిపైన రెచ్చిపోయారు. దాంతో ఆ అమ్మాయి ఏడిస్తే చంద్రబాబు ఫోన్ చేసి పోరాటాన్ని కంటిన్యుచేయమని చెప్పారు. భారతిమీద పోస్టులు పెట్టడం తప్పని బుద్ధిచెప్పలేదు. పైగా స్వాతికి మద్దతుగా నిలుస్తానని ధైర్యం చెప్పినట్లు చంద్రబాబే తన ట్విట్టర్లో పోస్టుచేశారు.
తన భార్యను అనేశారని చంద్రబాబు, తన తల్లిని అనరాని మాటలంటారా అని లోకేష్ వైసీపీ ఎంఎల్ఏల మీద నానా గోలచేశారు. అసెంబ్లీలో వైసీపీ వాళ్ళేమన్నారో ఎవరికీ వినిపించలేదు. అసలు భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడింది టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీనే. వంశీమీద యాక్షన్ తీసుకునుంటే సమస్య అప్పట్లోనే ఆగిపోయేది. ఆపనిచేయకుండా మీడియా ముందు చంద్రబాబు ఏడిస్తే ఏమిటి ఉపయోగం. భువనేశ్వరిని ఎవరో ఏదో అన్నారని చెప్పి భారతి మీద టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటంతో సమస్య మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డున పడేయకూడదని మూడుపార్టీల వాళ్ళు ఒకమాట అనుకుంటే కానీ ఈ సమస్య ఆగదు.