అమరావతి : భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నారా ?

Vijaya


తొందరలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి భారీ ప్యాకేజీ ప్రకటించబోతోందా ? పార్టీవర్గాలైతే అవుననే చెబుతున్నాయి. బుధవారం నరేంద్రమోడీ, అమిత్ షా తో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ప్యాకేజీ విషయం ఫైనల్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ప్యాకేజీకి సంబంధించిన చర్చలు ఇఫ్పటికే ఒకటికి రెండుసార్లు జరిగాయని ఇపుడు ఫైనల్ షేపుకు రాబోతోందని సమాచారం. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి. ఇవ్వలేదు సరికదా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ప్రత్యేకప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు.



ప్రకటనైతే చేశారు కానీ ఆ ప్యాకేజీ ఏమిటనేది బ్రహ్మపథార్ధంగా మిగిలిపోయింది. ప్రత్యేకప్యాకేజీ కింద రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నంటే ఎవరు సమాధానం చెప్పలేరు. ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం ఏపికి రెగ్యులర్ గా రావాల్సిన నిధులను ఇస్తున్నదే తప్ప అదనంగా ఇచ్చిందేమీలేదు. పైగా న్యాయబద్ధంగా అందాల్సిన నిధులు కూడా పూర్తిగా రావటంలేదు. పోలవరం రీఎంబర్స్ మెంటు, రెవిన్యులోటు తదితరాల కోసం అధికారంలోకి వచ్చినదగ్గర నుండి జగన్ కేంద్రపై ఒత్తిడి పెడుతునే ఉన్నారు.



కారణాలు ఏవైనా ఒత్తిళ్ళుఫలించి పోయిన నెలలోనే పోలవరం బకాయిలు+రెవిన్యులోటు కలిపి సుమారు రు. 23,500 కోట్ల విడుదలయ్యాయి. ఇంకా రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయట. ఈ నేపధ్యంలోనే రీఎంబర్స్ మెంట్లు, బకాయిలు కాకుండా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని మోడీపై  జగన్ బాగా ఒత్తిడిపెడుతున్నారు.  పార్టీవర్గాల సమాచారం ప్రకారం జగన్ అడిగిన ప్రత్యేక నిధులకు మోడీ సానుకూలంగా స్పందించారట. దీనిపై ఉన్నతస్ధాయివర్గాలు కసరత్తు కూడా పూర్తిచూశాయట.



తాజా సమాచారం ప్రకారం పరిస్ధితులన్నీ అనుకూలిస్తే  భారీఎత్తునే నిధుల విడుదలపై తొందరలోనే కేంద్రం ప్రకటనచేస్తుందట. కారణం ఏమిటంటే  నాన్ ఎన్డీయే పార్టీల్లో జగన్ నమ్మకమైన మద్దతుదారుడుగా ఉండటమే. రాజ్యసభలో బిల్లులు పాస్ అవటంలో జగన్ అందిస్తున్న సహకారంతో పాటు మద్దతివ్వటానికి ఎలాంటి బేరాలు ఆడకపోవటమేనట. రాజ్యసభలో వైసీపీ తరపున తొమ్మిదిమంది ఎంపీలున్నారు. టీడీపీ తరపున ఎన్నికైన ఇద్దరు ఎంపీలు వచ్చేఏడాది రిటైరవుతున్నారు. ఆ రెండుస్ధానాలు కూడా తర్వాత వైసీపీ ఖాతాలోనే పడే అవకాశముంది. నమ్మకమైన మద్దతుదారుడు కాబట్టే జగన్ డిమాండ్లపై మోడీ సానుకూలంగా ఉన్నారట. మరి భేటీ తర్వాత పరిణామాలు ఎలాగుంటాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: