హైదరాబాద్ : ఈ నవ్వులు ఎంతకాలం ఉంటాయో ?

Vijaya

తెలంగాణా బీజేపీ నేతల్లో పదవులే పెద్ద సమస్యగా మారింది. పార్టీ చీఫ్ బండి సంజయ్ కు హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కు పడటంలేదు. అలాగే బండికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మధ్య కూడా పెద్ద సఖ్యతలేదు. అలాగే చాలామంది సీనియర్లతో బండికి ఏమాత్రం పడటంలేదు. దాంతో పార్టీలో నేతలపరిస్ధితి ఏలాగైపోయిందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైపోయింది. చాలామంది నేతల్లో ఎవరిమాట ఎవరు వినేట్లుగా లేరు. బండి ఏమాట్లాడుతారో ఏం చేస్తారో ఎవరికీ తెలీటంలేదు.



చేరికల కమిటీకి ఈటల ఛైర్మన్ పేరుకే అయినా ఇతర పార్టీల నుండి నేతలెవరూ వచ్చి చేరటంలేదు.  బీజేపీలో చేరేవాళ్ళు ఎవరైనా టికెట్ ఆశించే చేరుతారు. అయితే రాదలచుకున్న నేతల్లో ఎవరికీ ఈటల టికెట్ హామీ ఇచ్చే పరిస్ధితిలేదు. ఎందుకంటే ఈటల హామీ ఇచ్చినంతమాత్రా బండి ఒప్పుకుంటారో లేదో తెలీదు. వీళ్ళిద్దరు ఒప్పుకున్నా ఫైనల్ గా కిషన్ రెడ్డి ఏమిచేస్తారో అనే అనుమానం.  ఈ ముగ్గురి మధ్య పంచాయితీల్లో నేతలు కూడా ఇలాగే చీలిపోయారు.



అందుకనే ముగ్గురి పొజిషన్లను మార్చేసి ఎవరికి వాళ్ళకుగా బాధ్యతల అప్పగించాలని అగ్రనేతలు అనుకున్నారట. బండి సంజయ్ ని అధ్యక్షుడిగా మార్చే ఆలోచన ఎవరికీ లేదని పార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్, పవన్ బన్సల్ చెప్పినా ఎవరు నమ్మటంలేదు.



ఎందుకంటే కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవాలని నరేంద్రమోడీ అనుకుంటున్నారట. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించి, ఈటలకు పార్టీ ప్రచారకమిటి అధ్యక్షుడిగా నియమించే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. మరి కారణం తెలీదు ఈటల, కిషన్ కు బండి  శాలువాలు కప్పి సత్కరిస్తున్న ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ ఫొటో ఎప్పుడు తీశారు, సందర్భం ఏమిటనేది కూడా తెలీటంలేదు. మొత్తానికి ఈ ఫొటోలోని నేతల నవ్వులు ఎంతకాలం ఉంటాయనే సెటైరికల్ చర్చ పార్టీలో పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: