కోస్తా : సైకిలెక్కేస్తున్నారా ? నియోజకవర్గాలే తేలాలా ?
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసినట్లుంది. నెల్లూరు జిల్లాలోని వైసీపీ రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబునాయుడుతో ఆనం శుక్రవారం దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. తర్వాత వెంటనే నెల్లూరుకు వెళ్ళిపోయారు. శనివారం ఉదయం టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. దాంతో ఆనం సైకిల్ ఎక్కే ముహూర్తం వచ్చేసిందనే అనుకుంటున్నారు. అలాగే కోటంరెడ్డి ఇంటికి శనివారం ఉదయం మాజీమంత్రి అమర్నాధరెడ్డి, బీద రవించద్రయాదవ్ వెళ్ళారు.
తమ్ముళ్ళిద్దరితో కోటంరెడ్డి గంటసేపు భేటీఅయ్యారు. వెంకటగిరిలో వైసీపీ తరపున గెలిచిన ఆనం, నెల్లూరు రూరల్ ఎంఎల్ఏగా గెలిచిన కోటంరెడ్డి చాలాకాలంగా టీడీపీతోనే ఉంటున్నారు. వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి నుండి చాలా ఆశించారు. అయితే వీళ్ళు ఆశించినదేదీ దొరకకపోవటంతో అసంతృప్తవాదులుగా తయారయ్యారు. అప్పట్లోనే లోపాయికారీగా చంద్రబాబుతో మాట్లాడుకున్నట్లున్నారు. అందుకనే బహిరంగంగా జగన్ తో పాటు ప్రభుత్వంపైన వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
సరే తర్వాత జరిగిన ఎంఎలఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా నలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగుకు పాల్పడినట్లు పార్టీ నాయకత్వం తేల్చింది. వీరిలో నెల్లూరు జిల్లాలోనే ఉన్న ముగ్గురు ఎంఎల్ఏల పాత్ర బయటపడింది. వాళ్ళల్లో ఆనం, కోటంరెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళంతా తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ముహూర్తమే ఎప్పుడన్నది తేలలేదు. అలాంటిది సడెన్ గా ఆనం టీడీపీ ఆఫీసుకు వెళ్ళి నేతలతో సమావేశమయ్యారు. ఆనంకు నియోజకవర్గమే తేలాలి. ఎందుకంటే వెంకటగిరిలో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది.
అలాగే కోటంరెడ్డి ఇంటికి సీనియర్ తమ్ముళ్ళు వెళ్ళి భేటీ అవటంతో ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని అర్ధమవుతోంది. కాకపోతే ముహూర్తం ఎప్పుడన్నది వీళ్ళే ప్రకటించాలి. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మరోవైపు పొత్తుల విషయం తేలలేదు. దానికితోడు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి లాంటి వాళ్ళ చేరికలు ఎప్పుడో తేలలేదు. దాంతో పార్టీలో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే గందరగోళాన్ని క్లియర్ చేయటంలో భాగంగానే వీళ్ళని చంద్రబాబు పార్టీలో చేరమని చెప్పినట్లున్నారు. అందుకనే నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి వీళ్ళద్దరు సైకిల్ ఎక్కే ముహూర్తం ఎప్పుడు, పోటీచేయబోయే నియోజకవర్గాలేవి అన్నదే తేలాలి.