అమరావతి : ఇద్దరికీ ఒకేరకమైన తలనొప్పా ?
అసంతృప్తి..అసమ్మతి..తిరుగుబాటు విషయం ఏదైనా రెండుపార్టీల్లోను కామన్ గా కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీల్లోను ఈ అంశంపై అధినేతలకు తలపోట్లు తప్పేట్లులేదు. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు అసమ్మతి నేతలనుండి సెగ మొదలైంది. ఇదే సమయంలో పుట్టపర్తి టీడీపీలో మాజీమంత్రి పల్లె రఘునాధరెడ్డి టికెట్ కోసం నానా అవస్తలు పడుతున్న విషయం బయటపడింది. రెండు రోజుల్లో రెండు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీల్లో బయటపడిన ముచ్చట మాత్రమే.
విషయం ఏమిటంటే టీడీపీకి సంబంధించి చంద్రగిరి, చిత్తూరు, తిరుపతి, పుంగనూరు, పెద్దాపురం, తుని, ప్రత్తపాడు, పీ గన్నవరం, జగ్గంపేట, మైలవరం, పెనుకొండ, ఆళ్ళగడ్డ, నంద్యాల, మడకశిర, నర్సన్నపేట లాంటి మరో 30 నియోజకవర్గాల్లో అసమ్మతి తీవ్రస్ధాయిలో ఉంది. అలాగే వైసీపీలో కూడా వెంకటగిరి, నెల్లూరు, ఉదయగిరి, తాడికొండ, మడకశిర, హిందుపురం, నగిరి, ప్రొద్దుటూరు, రాజంపేట లాంటి మరో 10 నియోజకవర్గాల్లో అసమ్మతి బయటపడుతోంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య స్పష్టమైన తేడా ఉంది. అదేమిటంటే పార్టీ లైన్ దాటిని వారిపై జగన్ వెంటనే వేటు వేసేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న కారణంగా నలుగురు ఎంఎల్ఏలను పార్టీ నుండి సస్పెండ్ చేసేశారు. ఇలాంటి చర్యలను చంద్రబాబు నుండి ఎప్పటికీ ఊహించలేము. అందుకనే టీడీపీలో అసమ్మతి కొన్నిచోట్ల బహిరంగమైతే మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులాగుంది. వేటువేయటంలో జగన్ కు ఒక క్లారిటి ఉంది. ఇదే సమయంలో ఎవరిమీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా చంద్రబాబుకు భయమే.
ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్దీ టికెట్ల కోసం రెండుపార్టీల్లోను ఇలాంటి అసమ్మతి ఇంకా బయటపడే అవకాశాలున్నాయి. అసంతృప్తి లేదా అసమ్మతి నేతలను అధినేతలు ఎలా డీల్ చేస్తారనే విషయమ్మీదే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములు ఆధారపడుంది. మంత్రులు, ఎంఎల్ఏలు బలంగా ఉన్నచోట అసమ్మతి అన్నది కనబడటంలేదు. ఎక్కడైతే మంత్రులు, ఎంఎల్ఏలు బలహీనంగా ఉన్నారో అక్కడ మాత్రమే అసమ్మతి స్పష్టంగా బయటపడుతోంది. జనసేన, వామపక్షాలతో పొత్తుంటే కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావటం చంద్రబాబుకు అసమ్మతి బోనస్ గా దక్కే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.