అమరావతి : ఎంఎల్ఏల్లో పెరిగిపోతున్న ‘14’ టెన్షన్
అధికారపార్టీ ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైంది. డిసెంబర్ 14వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే 14వ తేదీన మంత్రులు, ఎంఎల్ఏలతో జగన్మోహన్ రెడ్డి వర్క్ షాప్ పెడుతుండటమే. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం అమలైన తీరుపై జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇఫ్పటికే మూడుసమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. నాలుగోది, చివరిది అయిన వర్క్ షాప్ లో మంత్రులు, ఎంఎల్ఏల పనితీరును ప్రకటించబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.
కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి, మెరుగైన ఫలితాలు చూపించిన వారికే రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తానని గతంలోనే జగన్ ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొనటంలేదనే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొందరికి రెండుసార్లు వార్నింగులు కూడా ఇచ్చారు. తన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే టికెట్లుంటాయని స్పష్టంగా చెప్పేశారు. నేతలకన్నా తనకు పార్టీ మాత్రమే ముఖ్యమని జగన్ చెప్పిన తర్వాత కొందరిలో మార్పొచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
మూడో వర్క్ షాపులో జగన్ మాట్లాడుతు కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎంఎల్ఏల పేర్లను చదివి వినిపించారు. ఈనెల 14వ తేదీన జరగబోయే నాలుగో వర్క్ షాపే చివరిదని అనుకుంటున్నారు. మరిపుడు ఎవరిపేర్లను చదువుతారో తెలీక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం మంత్రులు, ఎంఎల్ఏల్లో సుమారు 35 మందిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది.
మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ బృందం ఇస్తున్న ఫీడ్ బ్యాక్ కు తోడు పార్టీపరంగా, ఇంటెలిజెన్స్ వర్గాల నుండి కూడా జగన్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. దీని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు పోటీ చేస్తాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏ నియోజకవర్గాల్లో కొత్తవాళ్ళు పోటీచేస్తారనే విషయంలో క్లారిటిలేదు. ఆ క్లారిటియే 14వ తేదీన జరగబోయే వర్క్ షాపులో వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఇందుకనే మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు జగన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.