ఉత్తరాంధ్ర : పవన్ కోరిక తీరుతుందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూస్తుంటే నిజంగానే బాగా జేలేస్తోంది. ఎందుకంటే మనసులోని మాటను కూడా ధైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారు. బీజేపీని వదిలేయాలని ఉంది. ఆ మాట ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోవాలని బలంగా ఉంది. ఈ విషయాన్నీ నిర్భయంగా చెప్పలేకపోతున్నారు. ఏమాట చెబితే ఏమవుతుందో అనే భయమే పవన్ను వెంటాడుతున్నట్లుంది. విజయనగరం జిల్లా గుంకలాంలో మాట్లాడిన మాటలే నిదర్శనంగా కనబడుతున్నది.
ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ మాట్లాడిన మాటల్లో ఎక్కడా మిత్రపక్షం బీజేపీ ప్రస్తావన తేలేదు. అలాగని తెలుగుదేశంపార్టీ పేరునూ ప్రస్తావించలేదు. ఎంతసేపు వైసీపీ ప్రభుత్వం కూలిపోతుంది జనసేన అధికారంలోకి వస్తుందని మాత్రమే చెప్పారు. జనసేనను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇంట్లో పెద్దోళ్ళకు యూత్ చెప్పాలట. జనసేనకు అధికారం అప్పగిస్తే పరిపాలన ఎలాగుంటుందో చూపిస్తానని ప్రతిజ్ఞచేశారు.
పవన్ మాటలు, ప్రతిజ్ఞ అంతాబాగానే ఉంది కానీ జనసేనకు అధికారం ఎప్పుడొస్తుంది ? జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటే ముందు 175 నియోజకవర్గాల్లో పోటీచేస్తేనే కదా ? 175 నియోజకవర్గాల్లో పోటీచేయాలి, మినిమం 90 సీట్లలో గెలవాలి. అప్పుడు కూడా జనసేనకు అధికారం వచ్చేది. అలాకాకుండా బీజేపీతో కలిసి పోటీచేసేట్లయితే ఓ వంద నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీచేయగలదు. పోనీ టీడీపీతో పొత్తుపెట్టుకుంటుందని అనుకుంటే అప్పుడు జూనియర్ పార్టనర్ మాత్రమే అవుతుంది. జూనియర్ పార్టనర్ హోదాలో మహాఅయితే ఓ 40 సీట్లకన్నా పోటీచేసే అవకాశంరాదు.
పోటీచేసేదే 40 సీట్లనుకున్నపుడు అందులో గెలిచేదెన్ని ? అన్నీ సీట్లూ గెలిచినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవుతారే కానీ పవన్ కారుకదా. మరపుడు రాబోయేది జనసేన ప్రభుత్వమే అని పవన్ ఎలా చెబుతున్నారు ? పైగా నామినేషన్లు వేయనీయకుండా ఎవరైనా అడ్డుపడితే కాళ్ళువిరగొడతామని వార్నింగిచ్చారు. నామినేషన్లంటే 175 నియోజకవర్గాల్లోను వేయబోతున్నారా ? ఇదే నిజమైతే జనసేన ఒంటరిపోరుకు రెడీ అవుతున్నట్లే అనుకోవాలి. మరదే నిజమైతే ఆమాట చెప్పటానికి పవన్ ఎందుకు భయపడుతున్నట్లు ?