అమరావతి : అమరావతి రైతుల అహంకారానికి ఇదే నిదర్శనమా ?
ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రాజధాని ప్రాంత రైతుల ముసుగులో ఆందోళనలు జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు సమాఖ్య పేరుతో అనేకమంది చేస్తున్న ప్రకటనల కారణంగా మిగిలిన ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. ఉత్తరాంధ్రలో అయినా రాయలసీమలో అయినా మూడురాజధానులకు మద్దతు పెరుగుతున్నదంటే అది అమరావతి ముసుగులో జరుగుతున్న ఓవర్ యాక్షన్ కారణమనే చెప్పాలి.
అలాంటిది తాజగా పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వటాన్ని అభ్యంతరం చెబుతు రైతులు కొందరు హైకోర్టులో కేసువేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా రైతుల ఆలోచనలను వాళ్ళ లాయర్ వినిపించారు. ఇంతకీ సదరు లాయర్ వాదన ఏమిటంటే రాజధాని నిర్మాణంకోసం తామిచ్చిన భూములను ప్రభుత్వం పేదలకు పట్టాలుగా ఇచ్చిందట. పేదలకు పట్టాలు ఇవ్వటం వల్ల రాజధాని ప్రాంతంలో మురికివాడలు ఏర్పాటవుతాయట. తాముంటున్న ప్రాంతంలో, రాజధాని నిర్మించిన భూముల్లో మురికివాడలు ఉండటం రైతులకు తీవ్ర అభ్యంతరమని వాళ్ళ లాయర్ చెప్పారు.
అంటే పేదలకు ఇంటిస్ధలాలు ఇవ్వటాన్ని అమరావతి ప్రాంతంలో జనాలు మురికివాడలుగా వర్ణిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఇంతకుముందు పేదలు లేరా ? అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న వాళ్ళలో పేదలు లేరా ? తాజాగా రైతుల తరపు లాయర్ వాదనలు విన్న తర్వాత అమరావతి ప్రాంతం వాళ్ళకు పేదలంటే ఎంతచిన్నచూపో అర్ధమవుతోంది.
ఇలాంటి మాటలు, చేష్టల కారణంగానే అమరావతిప్రాంతంపై మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆ వ్యతిరేకతను అమరావతి ప్రాంతంలోని జనాలు ప్రత్యక్షంగా చూస్తు కూడా తమ వైఖరిని మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఒకసారి ఒక అవసరం కోసం ప్రభుత్వానికి రైతులు లేదా స్ధానికులు భూములిచ్చేసిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా ప్రభుత్వ ఇష్టం. అంతేకానీ రాజధాని నిర్మాణం కోసం తాము భూములిచ్చాం కాబట్టి కచ్చితంగా రాజధాని మాత్రమే కట్టితీరాలని రైతుల ముసుగులో అమరావతి జనాలు కోర్టుకు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.