ఢిల్లీ : శశిథరూర్ గట్టోడే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి మల్లికార్జాన ఖర్గేతో పోటీచేసి ఓడిపోయిన శశిథరూర్ గట్టోడే అనుకోవాలి. ఖర్గేకి 7897 ఓట్లు పోలవ్వగా థరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మొత్తం 9300 ఓట్లుంటే పోలైంది 8969 ఓట్లు. కొందరు ఓట్లేయలేదు మరికొన్ని ఓట్లు చెల్లలేదు. ఓట్లు చెల్లకపోవటం ఏమిటో ? ఓటింగుకు గైర్హాజరవ్వటం ఏమిటో అర్ధం కావటంలేదు. ఇక్కడే థరూర్ గట్టివాడని అందరికీ అర్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే థరూర్ కు 1072 ఓట్లు వస్తాయని నేతలు ఎవరు అస్సలు ఊహించలేదు. ఒకవైపు ఖర్గే అధిష్టానం అభ్యర్ధిగా పోటీలోకి దిగిన తర్వాత ఇక థరూర్ కు ఓట్లెవరు వేస్తారనే అందురు అనుకున్నారు. ప్రచారంలో భాగంగా ఇద్దరు అన్నీరాష్ట్రాలూ తిరిగారు. అయితే థరూర్ రాష్ట్రాలకు వెళ్ళినపుడు అన్నీచోట్లా చేదుఅనుభవాలే ఎదురయ్యాయి. పీసీసీ అధ్యక్షులు కానీ సీనియర్ నేతలు కూడా ఎవరూ థరూర్ కు కలవటానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
థరూర్ రాష్ట్రాలకు వస్తున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించిన థరూర్ కు చాలామంది అందుబాటులోకి రాలేదు. దాంతోనే థరూర్ పరిస్ధితి ఏమిటనేది అందరికీ అర్ధమైపోయింది. ఇదే సమయంలో ఖర్గేకి మాత్రం అన్నీ రాష్ట్రాలు బ్రహ్మరథం పట్టాయి. ఖర్గే ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడి పీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఎదురెళ్ళి స్వాగతాలు పలికారు. ప్రచారంలో పాల్గొన్నారు. విమానం దిగి తిరిగి వెళ్ళేంతవరకు చాలామంది నేతలు వెంటే ఉన్నారు.
పార్టీలో ఈ తేడాను గమనించిన థరూర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. స్వయంగా థరూరే తన అసంతృప్తిని వ్యక్తంచేయటంతో ఆయనకు పదిఓట్లన్నా వస్తాయా అని అందరు అనుకున్నారు. అనవసరంగా థరూర్ పోటీలోకి దిగారనే అనుకున్నారు. తీరా ఫలితాల్లో 1072 ఓట్లు వచ్చాయని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. థరూర్ కి వెయ్యిఓట్లకు పైగా రావటమంటే మామూలు విషయంకాదు. అధిష్టానం అభ్యర్ధి అనే ట్యాగ్ గనుక ఖర్గేకి లేకపోతే ఫలితం ఎలాగుండేదో అని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.