అమరావతి : పవన్ ముసుగు తీసేశారా ?
ఇంతకాలం వేసుకున్న ముసుగును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసేశారు. బీజేపీతో దాదాపు కటీఫ్ చెప్పేసినట్లే అనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తుపైన తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తంచేసిన కొద్దిసేపటికే చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఎప్పుడైతే చంద్రబాబుతో భేటీ అయ్యారో అప్పుడే అనధికారికంగా బీజేపీతో కటీఫ్ చెప్పేసినట్లనే అనుకుంటున్నారు. కాకపోతే తమ భేటీ ప్రజాస్వామ్య పరిరక్షణకే అని కలరింగ్ ఇచ్చుకున్నారు.
తనను ప్యాకేజీస్టార్ అని దత్తపుత్రుడనే వైసీపీ నేతల ర్యాంగింగును పవన్ తట్టుకోలేకపోయారు. అందుకనే ఒక్కసారిగా మంత్రులు, నేతలపై బరస్టయ్యారు. చెప్పుతీసుకుని కొడతానని, ఇంట్లోనుండి రోడ్డుమీదకు లాక్కొచ్చి కొడతానని చెప్పుచూపించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయకుండా తనను బీజేపీ వెనక్కు లాగుతోందన్నట్లుగా అసంతృప్తి వ్యక్తంచేశారు. తాను రోడ్డుమ్యాప్ కావాలని అడిగితే ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
పవన్ తాజా వ్యాఖ్యలతోనే బీజేపీతో కటీఫ్ చెప్పేయటానికి జనసేన రెడీ అయిపోయిందని అర్ధమైపోయింది. పైగా తనను ముందుకు పోనీయని బీజేపీ విషయంలో తాను నిర్ణయం తీసేసుకున్నట్లు చెప్పారు. తన నిర్ణయం తాను తీసుకున్నాను అని చెప్పారేకానీ అదేమిటో మాత్రం చెప్పలేదు. అయితే పార్టీ సమావేశం అయిపోయిన కొద్దిసేపట్లోనే చంద్రబాబుతో భేటీఅయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నీపార్టీలు కలిసి పనిచేయటానికి నిర్ణయించినట్లు ఇద్దరు మీడియాతో చెప్పారు.
ఇంతకాలం బీజేపీకి మిత్రపక్షంగా ఉంటునే చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న పవన్ ఇపుడు డైరెక్టుగా చంద్రబాబుతో చేతులు కలిపారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే ఇంతకాలం వేసుకున్న ముసుగు తీసేసినట్లే అనుకోవాలా ? పైగా రేపటినుండి రాష్ట్రచరిత్రలో కొత్త రాజకీయాన్ని చూస్తారని హింట్ కూడా ఇచ్చారు. తర్వాత మొదలైన పరిణామాల కారణంగా టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లుగానే అందరు అనుకుంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నట్లు బహిరంగంగా ప్రకటించటం ఒకటే ఇక మిగిలింది. రెండుపార్టీలు పొత్తుపెట్టుకోవటం వల్ల లాభం ఎంత ? నష్టమెంత ? అన్నది ఇపుడే తెలిసేదికాదు. ఎందుకంటే రెండుపార్టీల పొత్తుపై అన్నీ వర్గాల్లోను మిశ్రమ స్పందన ఉంది కాబట్టే.