హైదరాబాద్ : తెలంగాణాలో టీడీపీకి సాధ్యమేనా ?
‘ఇతర పార్టీలకు చెందిన నేతలు చాలామంది టీడీపీలో చేరటానికి బాగా ఆసక్తి చూపుతున్నారు’ ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరటానికి చాలామంది నేతలు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. తొందరలోనే కొత్తనేతల చేరికలు ఉంటాయని కూడా నేతలతో అన్నారు. ప్రతి కార్యకర్త మరో పదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్చాలని కూడా చెప్పారు.
ఇక్కడే చంద్రబాబు చెప్పినమాటలు ఎవరికీ నమ్మబుద్ది కావటంలేదు. ఒకవైపేమో ఇతర పార్టీల నుండి చాలామంది నేతలు టీడీపీలో చేరటానికి బాగా ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ప్రతికార్యకర్త మరోపదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్పించాలన్నారు. రెండుకూడా పరస్పర విరుద్ధమైనవిగా అర్ధమవుతోంది. ఎందుకంటే నిజంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలు టీడీపీలో చేరేది నిజమే అయితే వాళ్ళతో పాటు వాళ్ళ మద్దతుదారులు కూడా చేరుతారు కదా. మళ్ళీ ప్రత్యేకించి పదిమంది కార్యకర్తలను టీడీపీ చేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది ?
అయినా తెలంగాణాలో టీడీపీ ఏ పరిస్ధితిలో ఉందో తెలీనివాళ్ళుంటారా ? టీడీపీ పరిస్ధితి ఐసీయూలో వెంటిలేటర్ మీదున్న రోగిలాగ అయిపోయింది. గడచిన ఎనిమిదన్నరేళ్ళల్లో టీడీపీ నుండి వందలమంది నేతలు ఎందుకు వెళ్ళిపోయారు ? చంద్రబాబే పార్టీని వదిలేసి ఏపీకి వెళ్ళిపోయారు కాబట్టి నేతలు కూడా పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. టీడీపీ నుండి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయారే కానీ ఇతర పార్టీల నుండి పెద్దగా ఎవరూ టీడీపీలో చేరలేదు.
పార్టీకి భవిష్యత్తు లేదని అర్ధమైన తర్వాతే తమ్ముళ్ళంతా తమదారి తాము చూసుకున్నారు. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం కాదు ఏపీలో కూడా పార్టీకి తెలంగాణా పరిస్ధితి రాకుండా చూసుకంటే అదే చాలాగొప్ప. ఆ విషయాన్ని మరచిపోయి ఇతర పార్టీల్లోనుండి నేతలొచ్చి టీడీపీలో చేరబోతున్నారని, పార్టీకి పూర్వవైభవం వచ్చేస్తోందని చంద్రబాబు చెబితే నమ్మే తమ్ముళెవరైనా ఉంటారా ?