అమరావతి : జగన్ వ్యూహానికి విలవిల్లాడుతున్నారా ?
రాజధాని అంశంపై జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విలవిల్లాడిపోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇదే సమయంలో అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఎందుకుంచాలో చెప్పలేకపోతున్నారు. అందుకనే ట్విట్టర్లో పిచ్చి పిచ్చి ట్వీట్లు పెడుతు కాలక్షేపం చేస్తున్నారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఎందుకు వద్దని ప్రభుత్వం అనుకుంటున్నదో జగన్ చాలా స్పష్టంగా చెప్పారు.
ఇదే సమయంలో మూడు రాజధానుల కాన్సెప్టును ఎందుకు ప్రతిపాదించారో కూడా అసెంబ్లీలోనే చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినపుడు హైదరాబాద్ విషయంలో ప్రస్తుత ఏపీకి జరిగిన అన్యాయం మరోసారి జరగకూడదనే మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నట్లు జగన్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్, న్యాయరాజధానిగా కర్నూలు, శాసనరాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. ఇందులో ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పటంలో తప్పేలేదు.
మూడుప్రాంతాల అభివృద్ధకే తమ ప్రభుత్వం కట్టుబడుందని జగన్ చెప్పారు. జగన్ ప్రతిపాదన తప్పని చంద్రబాబు, పవన్ ఇతర ప్రతిపక్షాలు మాట్లాడలేకపోతున్నాయి. జగన్ ప్రతిపాదన తప్పని నిరూపించలేక ఏకైక రాజధాని అమరావతే అంటు గోల చేయిస్తున్నారు. అమరావతి ప్రాంతం జనాలను రెచ్చగొట్టి దీక్షలు చేయించి ఇపుడు పాదయాత్రలు చేయిస్తున్నారు. వీళ్ళతో పాటు బీజేపీ నేతలు కూడా తోడయ్యారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ జనాలను ఓట్లడిగేటపుడు ఏమని అడుగుతారు ?
ఇపుడు వైజాగ్, కర్నూలులో రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ వచ్చే ఎన్నికల్లో పై ప్రాంతాల్లోని జనాలని ఏమిచెప్పి కన్వీన్స్ చేస్తారు. ఇపుడీ విషయమే వీళ్ళిద్దరినీ బాగా వేధిస్తున్నట్లుంది. అందుకనే ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన వైజాగ్ లో జరగబోతున్న ప్రజాగర్జనను వ్యతిరేకిస్తు పవన్ పనికిమాలిన ట్వీట్లు పెట్టారు. ట్వీట్ల ద్వారా పవన్ అడిగిన ప్రశ్నల్లో చాలావాటికే ముందు చంద్రబాబే సమాధానం చెప్పాలి. అప్పుడు వేయని ఈ ప్రశ్నలను పవన్ ఇపుడు వేస్తున్నారంటేనే వీళ్ళకి ఏమి మాట్లాడాలో అర్ధం కావటంలేదని అర్ధమైపోతోంది.