అమరావతి : ఏపీ విషయంలో కేసీయార్ సరికొత్త వ్యూహం ?

Vijaya






జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఏపీ విషయంలో సరికొత్త వ్యూహం అనుసరించబోతున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు ఏపీ ప్రయోజనాలను కేసీయార్ పట్టించుకోలేదు సరికదా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తే తెలంగాణాకు  కూడా హోదా ఇవ్వాల్సిందే గులాబీ నేతలు డిమాండ్ చేశారు.



విభజన హామీల ప్రకారం తెలంగాణా నుండి ఏపీకి రావాల్సిన నిధులను ఇవ్వలేదు. పైగా ఏపీనే తమకు నిధులు ఇవ్వాలంటు పేచీ పెట్టుకున్నారు. విభజన హామీల అమలు సమావేశాలకు రమ్మంటే తెలంగాణా అధికారులు హాజరుకాకపోతే ఎవరైనా హాజరైనా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అంటే విభజన హామీలు, సమస్యల పరిష్కారం అవటం లేదా ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించటం కేసీయార్ కు ఏమాత్రం ఇష్టంలేదని అర్దమైపోతోంది.



ఇన్నివిధాలుగా ఇబ్బందులు పెడుతున్న కేసీయార్ మరి బీఆర్ఎస్ కు ఓట్లేయమని రాబోయే ఎన్నికల్లో ఏపీ జనాలను ఎలాగ అడుగుతారు ? దీనికి సమాధానమే ఏపీ డిమాండ్లు, సమస్యలను కేసీయార్ భుజానేసుకోవాలని అనుకుంటున్నారట. ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖకు రైల్వేజోన్ మంజూరు చేయాలనే డిమాండ్లను వినిపించబోతున్నట్లు సమాచారం. తెలంగాణా ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలవరంకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేయబోతున్నారట. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గొంతు వినిపించబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.



అంటే కేసీయార్ చేసే డిమాండ్లేవీ నరేంద్రమోడీ సర్కార్ నెరవేర్చే అవకావాలు లేవని అందరికీ తెలుసు. కేసీయార్ చేస్తారని అనుకుంటున్న డిమాండ్లలో ఏపీపైన ప్రేమకన్నా బీజేపీని ఇరుకునపెట్టడమే అసలు టార్గెట్. మోడీపై ఆరోపణలు చేయాలన్నా, బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నా కేంద్రంపై డైరెక్టు ఎటాక్ చేయటమే ఉత్తమమైన మార్గమని కేసీయార్ కు బాగా తెలుసు. ఇక్కడ కేసీయార్ కున్న అడ్వాంటేజ్ ఏమిటంటే కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు డిమాండ్ చేయలేని పరిస్ధితిని అడ్వాంటేజ్ తీసుకోవాలని కేసీయార్ అనుకుంటున్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: