అమరావతి : రాష్ట్రమంటే 29 గ్రామాలేనా ?

Vijaya






చరిత్రనుండి పాఠాలు నేర్చుకోవాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు మాత్రం అనుభవం పాఠాలేమీ నేర్పలేదని అర్ధమైపోతోంది. ఎందుకంటే రాష్ట్రమంటే 29 గ్రామాలే అని ఇప్పటికీ చంద్రబాబు పట్టుబడుతున్నారు కాబట్టే. సమైక్య రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి రాజధాని లేకుండా ఏపీని అప్పటి యూపీయే ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గడచిన 50 ఏళ్ళుగా 23 జిల్లాల ప్రజలు చెమటలు చిందించి ఎంతో కష్టపడి రాజధాని హైదరాబాద్ డెవలప్ చేశారు.



అయితే అడ్డుగోలు విభజనవల్ల అందరి రాజధాని కాస్త చివరకు 10 జిల్లాలకు మాత్రమే రాజధానిగా మారిపోయింది. దాని ఫలితం రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదన్నరేళ్ళయినా ఇంకా ఏపీ జనాలు అనుభవిస్తునే ఉన్నారు. అలాంటిది ఏపీకి మొదటి ముఖ్యమంత్రయిన చంద్రబాబు మళ్ళీ హైదరాబాద్ ప్రయోగాన్నే మొదలుపెట్టారు. అమరావతిని రాజధానిగా చేసుకుని మొత్తం అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకృతం చేయాలని ట్రైచేశారు. ఎంతమంది వద్దని చెప్పినా వినకుండా తన పద్దతిలోనే తాను వెళ్ళారు.



అయితే అదృష్టంకొద్దీ 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు ప్రయత్నాలు మొదట్లోనే ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు రాజధానుల కాన్సెప్టు ప్రకటించారు. వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అమరావతి శాసనరాజధానిగా ఉంచారు. నిజానికి చంద్రబాబే వైజాగ్ ను క్యాపిటిల్ గా చేసుంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే బాగా డెవలపయిన విశాఖ నగరంలో కొద్దిగా ఖర్చు పెట్టుకునుంటే బ్రహ్మాండమైన రాజధానిగా తయారయ్యేది.




అలాకాదని లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడితో అమరావతిని రాజధానిగా చేయాలని చంద్రబాబు అనుకోవటమే పెద్ద తప్పు. అందుకనే అమరావతి మన రాజధాని అనే భావన ఉత్తరాంధ్ర, రాయలసీమ జనాల్లో కలగలేదు. దాని ఫలితమే టీడీపీ ఘోరఓటమి. అయినా చంద్రబాబు పాఠం నేర్చుకోకుండా ఇప్పటికే అమరావతిని మాత్రమే ఏకైకరాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. ఇందుకనే రాష్ట్రమంటే కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాలేనా అని జనాలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మరి జనాలప్రశ్నకు చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: