రాయలసీమ : జేసీ బ్రదర్స్ కు స్పష్టంగా చెప్పేసినట్లేనా ?
జేసీ బ్రదర్స్.. వీళ్ళున్న పార్టీకి వీళ్ళవల్ల ప్లస్సో లేకపోతే మైనస్సో కూడా తెలీదు. వీళ్ళిద్దరి క్యారెక్టర్ ను అంచనా వేయటం ఎవరివల్లాకాదు. ఎందుకంటే ఎప్పుడేం మాట్లాడుతారో ? ఎవరిగురించి మాట్లాడుతారో వీళ్ళకే తెలీదుకాబట్టి. జాతీయపార్టీ కాబట్టి కాంగ్రెస్ వీళ్ళిద్దరినీ భరించగలిగింది కానీ ప్రాంతీయపార్టీ టీడీపీ వల్ల కావటంలేదు. చంద్రబాబు ఒకటిచెబితే వీళ్ళు మరోటి చేస్తారు. పార్టీ వ్యవహారాలను ఎట్టి పరిస్ధితుల్లోను బయట మాట్లాడద్దంటే కచ్చితంగా బయటే అందులోను మీడియాతోనే మాట్లాడుతారు.
ఇలాంటి రెండు క్యారెక్టర్లతోను వచ్చే ఎన్నికల విషయమై చంద్రబాబు రెండు విషయాలను స్పష్టంగా చెప్పేశారట. మొదటిదేమో అనంతపురం ఎంపీ, తాడిప్రతి ఎంఎల్ఏలుగా వారసులకు టికెట్లు ఇవ్వనని చెప్పేశారట. అనంతపురం ఎంపీగా మళ్ళీ జేసీ దివాకరరెడ్డే పోటీచేయాలని. తాడిపత్రి ఎంఎల్ఏ గా మళ్ళీ జేసీ ప్రభాకరరెడ్డే పోటీచేయాలని చెప్పారట. రెండో విషయం ఏమిటంటే తమరెండు నియోజకవర్గాల్లో తప్ప మూడో నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పేశారట.
పోయిన ఎన్నికల్లో సమస్య ఏమొచ్చిందంటే వీళ్ళిద్దరు కనీసం పది నియోజకవర్గాల్లో వేళ్ళే కాదు కాళ్ళు కూడా పెట్టేశారు. ఎంఎల్ఏలు, నియోజకవర్గాల ఇన్చార్జీలకు వ్యతిరేకంగా తమ మద్దతుదారులను రంగంలోకి దింపేశారు. జేసీ బ్రదర్స్ పై ఎంఎల్ఏలు, ఇన్చార్జిలు ఎంతమొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. పట్టించుకోలేదంటే వీళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటి చంద్రబాబుకు లేదంతే. గడచిన మూడేళ్ళుగా మళ్ళీ అదే పనిచేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులతో రాజకీయాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లిప్పిస్తామని చెప్పటంతో చాలా నియోజకవర్గాల్లో నానా గొడవలు జరుగుతున్నాయి.
ఇదే విషయాన్ని చంద్రబాబు బ్రదర్స్ కు చెప్పేశారట. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎలాంటి జోక్యం వద్దని పిలిచి మరీచెప్పారట. చంద్రబాబుచెప్పింది వినేట్లయితే వీళ్ళు జేసీబ్రదర్స్ ఎందుకవుతారు ? ఇప్పటికి ఏమీ మాట్లాడటంలేదు కానీ ముందు ముందు వీళ్ళు ఎలాగుంటారో అనే టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. మొత్తానికి టీడీపీకి జేసీ బ్రదర్స్ పెద్ద తలనొప్పిగానే తయారయ్యారని చెప్పాలి. మరీ తలనొప్పి ఎప్పటికి వదులుతుందో ఏమో పాపం.