అమరావతి : ఇద్దరు కలిసి అమరావతిని చంపేశారా ?
జనాలను భ్రమల్లో ముంచేసి ఒకళ్ళు, ఇగోకి వెళ్ళి మరొకళ్ళు రాజధాని అమరావతి భావననే చంపేశారు. తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ విషయం స్పష్టమైపోయింది. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో జనాలందరినీ మోసంచేశారు. కేవలం రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించి లేని హైప్ ను కృత్రిమంగా సృష్టించి అమరావతంటే కేవలం కొంతమందికోసమే రూపొందించిన రాజధాని అనే భావనను మిగిలిన జనాల్లో బలంగా నాటుకునేట్లు చేసి చివరకు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.
రాజధాని నిర్మాణంపేరుతో చంద్రబాబు వేలకోట్లరూపాయలు నాశనంచేసేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నింటినీ తాత్కాలిక నిర్మాణాలని చెప్పి వేలకోట్ల రూపాయలు తగలేసి నాసిరకం నిర్మాణాలు చేశారు. ఐదేళ్ళు అధికారంలో ఉండి చివరకు భూములిచ్చిన రైతులకు అభివృద్ధిచేసిన ప్లాట్లను ఇవ్వకుండా, మౌళిక సదుపాయాలు కూడా కల్పించలేక, చివరకు ప్లాట్లను రైతులకు రిజిస్టర్ కూడా చేయకుండా అందరినీ నిలువునా ముంచేసి హ్యాపీగా ఇపుడు చోద్యం చూస్తున్నారు.
అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు మీద కోపంతోనే అమరావతి భావనను నాశనంచేసేశారు. రాజధాని అనే భావనను చంద్రబాబు సగం చంపేస్తే మిగిలిన సగాన్ని జగన్ నాశనంచేసేశారు. అందుకనే రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్లను వేలం ద్వారా అమ్మాలని ప్రయత్నిస్తే ఒక్కళ్ళు కూడా కొనేందుకు ముందుకురాలేదు. 56 ఎకరాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను అమ్మేందుకు చేసిన ప్రయత్నం అట్టర్ ఫెయిలైంది. తెనాలి, నవులూరు, ఇబ్రహింపట్నంలో వేలానికి వుంచిన ప్లాట్లను కొనేందుకు ఎవరు ముందుకురాలేదు.
ఎట్టిపరిస్ధితుల్లోను అమరావతిని రాజధానిగా ఉంచకూడదన్న జగన్ ఆలోచన అర్ధమైపోయిన తర్వాత ఇక్కడ భూములు కొనటానికి ఎవరు ముందుకొస్తారు ? కనీసం ప్రభుత్వానికి ఈమాత్రం ఆలోచన కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇది సరిపోదన్నట్లు తొందరలో కోర్ క్యాపిటల్ ప్రాంతంలో 14 ఎకరాల వేలానికి రెడీ అవుతోంది. మొత్తానికి ఇద్దరు కలిసి చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి జనాల్లో అమరావతి మన రాజధాని అనే భావననే చంపేశారు.