ఆ ఇద్దరి పొత్తులపై.. అధికార పార్టీ కామెంట్స్ ఇవీ..!

NAGARJUNA NAKKA
పొత్తులపై వైసీపీ ఎగిరిగెరి పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి పర్యటనలో మండిపడ్డారు. రాజకీయాల్లో పొత్తులు సహజమనీ.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ నాశనమే అవుతుందన్నారు. మళ్లీ కోలుకోలేనంతగా రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్పారు. వైఎస్ఆర్.. కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్.. వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ కంటే జగన్ గొప్పవాడా..? అని ప్రశ్నించారు. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ..పొత్తులపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార పార్టీల నేతలు స్పందించారు. వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితం మొత్తం పొత్తుల మయం అన్నారు. 2019 మినహా పొత్తులేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. చంద్రబాబు, పచ్చమీడియా చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి.. అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని.. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం పర్యటనలో మంత్రి అన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మొదటి నుంచి అక్రమ పొత్తులున్నాయని మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమికి బుద్ది చెప్పేందుకు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ రాజకీయ వ్యభిచారి అనీ.. బీజేపీ పక్కన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే.. ఏం అంటారు అని ప్రశ్నించారు. వారి పొత్తులతో తమకు వచ్చే ఇబ్బంది ఏముందని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని రమేశ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు అధికారం కోసం మామను చంపిన చరిత్ర చంద్రబాబుదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు హత్యలు చేయించారన్నారు. జగన్ దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ.. ఆరోపణలు చేసిన వారంతా కాలగర్భంలో కలవక తప్పదన్నారు. టీడీపీ ఇప్పటికే వెంటిలేటర్ పై ఉందనీ.. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదన్నారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మున్సిపాలిటీ.. మండలంలో కూడా టీడీపీ గెలవలేదన్నారు బాలినేని.










మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: