రాయలసీమ : బైరెడ్డి అంత తప్పు చేస్తారా ?
కర్నూలు జిల్లాలోని అధికారపార్టీ నేత, శాప్ ఛైర్మన్ పై కొత్తగా ఒక ప్రచారం మొదలైంది. అదేమిటంటే తొందరలోనే బైరెడ్డి వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని. రాజీనామా చేసిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో చేరటానికి ఇప్పటికే బైరెడ్డి డిసైడ్ అయిపోయారట. ఈ కారణంగానే మూడు, నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో కానీ నియోజకవర్గంలో కానీ అంత యాక్టివ్ గా కనబడటంలేదట.
మామూలుగా అయితే ఈ యువనేత పార్టీ కార్యక్రమాల్లోకానీ నియోజకవర్గంలో కానీ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంత యాక్టివ్ గా ఉండే నేత హఠాత్తుగా కొంతకాలంగా సైలెంట్ అయిపోవటం వెనుక పార్టీ మారే ఆలోచన ఉందనేది ఇపుడు జరుగుతున్న ప్రచారం. జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డికి మంచి పట్టుంది. అయితే ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావటంతో ఈయనకు పోటీచేసే అవకాశంలేదు.
ఈ కారణంగానే ఎంఎల్ఏ ఆర్ధర్ తో ఎప్పుడూ ఆధిపత్యం గొడవలు జరుగుతున్నది. నిజానికి ఎంఎల్ఏ అయినా బైరెడ్డి అయినా పార్టీకి ఇద్దరూ కావాల్సిన వారే. నియోజకవర్గం ఎస్సీ కావటంతో మరో సామాజికవర్గానికి పోటీకి అవకాశంలేదు. ఇదే సమయంలో పార్టీలో బలంగా ఉన్న బైరెడ్డి లాంటివాళ్ళు మద్దతులేనిదే ఆర్ధర్ గెలవలేరు. ఈ రెండు విషయాలను ఇద్దరు గుర్తుంచుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ ఇద్దరు తగ్గటంలేదు కాబట్టే వివాదం పెరిగిపోతోంది.
సరిగ్గా ఇక్కడే టీడీపీ ఎంటరయ్యిందట. టీడీపీలోకి బైరెడ్డి వస్తే నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాలు మూడింటికి ఇన్చార్జీగా చేస్తామని హామీ వచ్చిందట. అంటే నందికొట్కూరు వదిలేస్తే మిగిలిన రెండుచోట్లలో ఎక్కడినుండైనా బైరెడ్డి పోటీచేయవచ్చునే హామీ దక్కిందంటున్నారు. ఈమధ్యనే నారా లోకేష్ తో బైరెడ్డి సమావేశమైనట్లు కూడా చెప్పుకుంటున్నారు. బైరెడ్డి గనుక టీడీపీలోకి వస్తే పార్టీలో నుండి గౌరు వెంకటరెడ్డి, చరితారెడ్డి బయటకు వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయినా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుల్లో ఒకడైన బైరెడ్డి పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతారా ? అనేదే పెద్ద చర్చ. చూద్దాం తొందరలోనే ఏదోకటి తేలిపోతుంది కదా.