అమరావతి : పవన్ షాక్ నుండి చంద్రబాబు ఇంకా తేరుకోలేదా ?
‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని, రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుంద’ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పి వారం రోజులవుతోంది. ఇప్పటివరకు చంద్రబాబునాయుడు ఎందుకని స్పందించలేదో అర్ధం కావటంలేదు. అంతకుముందు వరకు పవన్ తో పొత్తు పెట్టుకోవటానికి లవ్ ప్రపోజల్స్ పంపిన చంద్రబాబు జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రతిపాదనకు ఇంతవరకు స్పందించలేదు. పవన్ మాటల్లో చంద్రబాబు లవ్ ప్రపోజల్ ను ఆమోదించినట్లే అర్ధమవుతోంది.
అప్పటివరకు వన్ సైడ్ లవ్ నడిపిన చంద్రబాబు జనసేనాధిపతి ఓకే చెప్పగానే మౌనంగా ఉండిపోవటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే పవన్ సభలో మాట్లాడుతు రాష్ట్ర బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. అంటే ఒకవేళ తానున్న కూటమి గనుక అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్చీ తనదే అని పరోక్షంగా ప్రకటించేశారు. ఇంతకాలం జనసేన చేసిన త్యాగాలు చాలని ఇకనుండి త్యాగాలు చేసేదిలేదని చెప్పేశారు. పవన్ చేసిన ఈ ప్రకటనతోనే చంద్రబాబు గొంతులో వెలక్కాయపడిపోయింది.
ఎలాగంటే రాజకీయ చివరిదశకు వచ్చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీని మరొకరికి ఇచ్చే సమస్యేలేదు. చివరిసారిగా తాను ముఖ్యమంత్రవ్వాలి తన తర్వాత కొడుకు లోకేష్ ను సీఎంగా చేయాలన్నదే చంద్రబాబు జీవితాశయం. అలంటి టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబుకు పవన్ ప్రకటన పెద్ద అడ్డంకిగా మారింది. అందుకనే పవన్ యాక్సెప్ట్ చేసిన లవ్ ప్రపోజల్ విషయంలో చంద్రబాబు వెనకాడుతున్నది. టీడీపీతో పొత్తుకు ఓకేని పవన్ పరోక్షంగా ప్రకటించేసినట్లే. దానికి టీడీపీ ఈపాటికే సంబరాలు చేసుకుని ఉండాల్సిందే. కానీ చంద్రబాబు దగ్గర నుండి ఎవ్వరు నోరిప్పకపోవటానికి కారణం పవన్ పెట్టిన కండీషనే.
ఈ పరిస్ధితుల్లో చంద్రబాబును సీఎం చేయటానికి పవన్ మరోసారి పల్లకీ మోస్తారా ? పవన్ సిద్ధమపడినా మిత్రపక్షం బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది ? ముఖ్యమంత్రవ్వాల్సిన అవసరం ముందు చంద్రబాబు తర్వాత పవన్ కే ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తే వీళ్ళద్దరి పని గోవిందానే. జగన్ సీఎం అయితే బీజేపీకి వచ్చే నష్టమేమీలేదు. మరి ఎవరి పల్లకి ఎవరు మోస్తారో చూడాలి.