అమరావతి : జనసైనికులను చూస్తుంటే జాలేస్తోందా ?

Vijaya



మంత్రి పేర్నినాని చెప్పారని కాదుకానీ నిజంగానే జనసైనికులను చూస్తుంటే జాలేస్తోంది. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే ఆయువుపట్టు. పై స్ధాయిలో నేతలు కొన్ని వందలమంది మాత్రమే ఉంటారు. కానీ జెండాలను భుజానేసుకుని మోసి, బ్యానర్లు కట్టే  కార్యకర్తల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎన్నికల సమయంలో ఈ కార్యకర్తలే ఏ పార్టీకైనా చాలా కీలకం. ఇప్పటి విషయానికి వస్తే జనసేనకు ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదు.



ఇపుడిప్పుడే మొదలైంది. అయితే జనసేనకు ప్రత్యేకించి నేతలు, కార్యకర్తలని ప్రత్యేకంగా ఎవరు లేరు. ఉన్నదంతా పవన్ అభిమానులు కొద్దిమంది కాపు సామాజికవర్గంలోని యాక్టివిస్టులే. అయితే వీళ్ళని  కూడా పవన్ అయోమయంలో పడేస్తున్నారు. ఏ ఎన్నికలలో ఎవరికి ఓట్లేయాలో తెలీకుండా అభిమానులు అయోమయంలో పడిపోతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు ఓట్లేయమని అడిగారు. 2019 ఎన్నికల్లో తనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ, వామపక్షాల అభ్యర్ధులకు ఓట్లేయమన్నారు.



ఈమధ్యనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొందరితో నామినేషన్లు వేయించి తర్వాత అభ్యర్ధులను ఉపసంహరించుకున్నారు. దాంతో బీజేపీ మిత్రపక్షం కోసమనే తాను నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. మళ్ళీ ఎంఎల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి వాణికి ఓట్లేయమన్నారు. తర్వాత జరిగిన విచిత్రం ఏమిటంటే ఏపీలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ ఉండగానే లోపాయికారీగా టీడీపీకి ఓట్లేయమన్నారు.



అంతకుముందు 2019 ఎన్నికల్లో  మంగళగిరి లాంటి కొన్ని నియోజకవర్గంలో మిత్రపక్షాల అభ్యర్ధులు పోటీచేసినా ప్రచారానికి వెళ్ళలేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసమే పవన్ వెళ్ళలేదని అందరికీ తెలుసు. మధ్యలో బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక జరిగితే మిత్రపక్షం అభ్యర్ధికి కనీసం ప్రచారం కూడా చేయలేదు.  ఇలాంటి నేపధ్యంలో రేపటి ఎన్నికల్లో పవన్ ఎవరికి ప్రచారం చేస్తారో ? ఎవరికి ఓట్లేయమంటారో తెలీక కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. బహుశా ఇన్ని అయోమయాల్లోనే పవన్ పోటీచేసిన భీమవరం, గాజువాకలో అభిమానులు, కార్యకర్తలు పవన్ కు ఓట్లేయటం మరచిపోయారేమో. మరి రేపటి ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: