అమరావతి : చంద్రబాబు-పవన్ ఇద్దరికీ కష్టమేనా ?

Vijaya



ఎక్కడో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఎగ్జిపోల్స్ సర్వే ఫలితాలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు కష్టాలనే తెచ్చిపెట్టాయి. ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లు ఎన్నికలు ఎక్కడో జరగటం ఏమిటి ? దాని తాలూకు ప్రభావం ఏపీపైన పడటం ఏమిటో. ఇంతకీ విషయం ఏమిటంటే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే దేశరాజకీయాలు మలుపు తిరుగుతాయని అందరు భావించారు.



ఇందులో భాగంగానే ఏపీ రాజకీయాల్లో కూడా సడన్ డెవలప్మెంట్లు ఉంటాయని అందరు అనుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం యూపీలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రాబోతోంది. మెజారిటి బాగా తగ్గిపోయినా అధికారం అయితే కమలనాదులకే ఖాయమని తేలిపోయింది. ఒకవేళ యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే దాని ప్రభావం 2024 ఎన్నికల్లో పడటం ఖాయమనుకున్నారు.



ఎలాగంటే రాబోయే ఎన్నికల్లో జనసేన+బీజేపీలతో టీడీపీ కూడా కలిసే అవకాశాలున్నాయనేది కొందరి ఆశ. జాతీయస్ధాయిలో బీజేపీ బలహీనపడితే రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందనే వాదన బయలదేరింది. ఇందులో భాగంగానే తమతో చంద్రబాబును కూడా బీజేపీ కలుపుకుంటుందని అనుకున్నారు. యూపీలో తగిలే ఎదురుదెబ్బ వల్ల పార్టనర్ పవన్ కు ఆటోమేటిగ్గా వెయిట్ పెరుగుతుందని కూడా ఆశించారు. కానీ ఎగ్జిట్ పోల్ ప్రకారం అదేమీ జరిగే అవకాశం లేదని తేలిపోయింది. బీజేపీ కంఫర్టబుల్ గా ఉంటే చంద్రబాబును నరేంద్రమోడి అసలు పట్టించుకునే అవకావమే లేదు. దాంతో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేలా లేదు. ఇదే చంద్రబాబును బాగా ఇబ్బంది పెడుతోంది. 



పనిలో పనిగా ఇష్టంలేకపోయినా ఇపుడు బీజేపీతోనే పవన్ ఉండాల్సిన అనివార్యత వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఏపీలో లాభనష్టాలతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను పవన్ దృష్టిలో పెట్టుకుని బీజేపీతోనే కంటిన్యు అవుతారంటున్నారు.  బీజేపీ ఆమోదం లేకుండా టీడీపీ వీళ్ళతో కలిసే అవకాశమే లేదు. ఈ విధంగా చూసుకుంటే చంద్రబాబుతో పాటు పవన్ కు కూడా కష్టమొచ్చినట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: