కీవ్ : ఉక్రెయిన్ యుద్ధం చైనాకు వార్నింగేనా ?

Vijaya



రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఎప్పుడైతే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిందో వెంటనే ప్రపంచదేశాలు తీవ్రంగా వ్యతిరేకించటం మొదలుపెట్టాయి. రష్యాపై అనేకరకాలుగా ఆంక్షలు పెట్టేస్తున్నాయి. ఆర్ధిక, క్రీడా రంగాల నుండి  ప్రపంచ దేశాలు పెద్దఎత్తున కఠినమైన ఆంక్షలు విధించేశాయి. ఆర్ధిక కార్యకలాపాలు సాగించకుండా స్విఫ్ట్ పద్దతిలో అమెరికా నేతృత్వంలోని దేశాలు రష్యాపై బ్యాన్ విధించేశాయి.



దీనివల్ల ఏమైందంటే రష్యాకు బయటనుండి నిధులు రావటం ఆగిపోయాయి. అలాగే విదేశాల్లోని బ్యాంకుల్లో రష్యాకున్న వందల కోట్ల డాలర్లను స్విఫ్ట్ పద్దతిలో ఫ్రీజ్ చేసేశాయి. దాంతో బయటనుండి నిధులు అందక, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు అక్కరకు రాక రష్యా ఇబ్బందులు పడుతోంది. దీనివల్ల రష్యా కరెన్సీ రూబుల్ విలువ పాతాళానికి పడిపోయింది. ఇదే కాకుండా వర్తక, వాణిజ్య కార్యకలాపాలు, కాంట్రెక్టులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.



ఇవన్నీ చూసిన తర్వాత అందరి దృష్టి చైనాపైన పడింది. ఎందుకంటే చైనా కూడా ఎప్పుడెప్పుడు తైవాన్ మీద దాడి చేద్దామా ? దేశాన్ని కబ్జా చేసేద్దామా అని ప్రయత్నాలు చేస్తోంది. రష్యా ముందు ఉక్రెయిన్ ఎంతదో చైనా ముందు తైవాన్ కూడా అంతే. ఉక్రెయిన్ పై యుద్ధం కారణంగా ప్రపంచదేశాలు రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించాయో అలాంటి ఆంక్షలనే తైవాన్ మీద యుద్ధమంటే చైనాపైన కూడా విధించే అవకాశాలు ఎక్కువున్నాయి.



అయితే రష్యాకు చైనాకు మధ్య చిన్న తేడాఉంది. అదేమిటంటే రష్యాపైన గ్యాస్ విషయంలో యూరోపియన్ దేశాలు మాత్రమే ఆధారపడ్డాయి.  యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ కు యూరోపు దేశాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే చైనా విషయం వేరు. ఎలాగంటే చైనాపైన మెడికల్ ఎక్విప్మెంట్, ఆటవస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటి చాలావాటిపై ప్రపంచదేశాలు ఆధారపడ్డాయి. తప్పని పరిస్ధితులు ఎదురైతే రష్యాపైన ఎలాంటి నిషేధాలు విధించాయో రేపు చైనాకైనా ఇదే జరుగుతుంది. అందుకనే ప్రస్తుత యుద్ధం ప్రపంచదేశాలు చైనాకు వార్నింగ్ ఇస్తున్నట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: