హిజాబ్‌పై కర్ణాటక మరో వివాదాస్పద నిర్ణయం..?

Chakravarthi Kalyan
హిజాబ్‌  వివాదం కర్ణాటకలో మొదలైనా ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశమైంది. పాఠశాలలు, కళాశాలల్లో మత పరమైన వస్త్రధారణ అనుమతించబోమంటూ కర్ణాటకలోని ఓ కళాశాలలో పెట్టిన నిబంధన ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు అవకాశం కల్పించింది. ముస్లిం విద్యార్థినులకు పోటీగా అన్నట్టు హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు, శాలువాలు తీసుకురావడంతో వివాదం మరింత ముదిరింది.  ముస్లిం విద్యార్థినులు ముఖం ప్రాంతాన్ని కవర్‌ చేసుకునే హిజాబ్ ధరించడంపై అభ్యంతరం చెప్పడం ముస్లింలనే కాక అనేక సెక్యులర్ శక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఈ వివాదం చివరకు హైకోర్టుకు చేరి.. ప్రస్తుతానికి ఏ రకమైన ప్రత్యేక వస్త్రధారణ కూడా వద్దని హైకోర్టు సూచించింది.

ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం ప్రకటించింది. అదేంటంటే... కర్ణాటకలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మైనారిటీ స్కూళ్లు, కాలేజీల్లోనూ హిజాబ్‌ ధరించడం కుదరదన్న నిబంధనను తప్పనిసరిగా పాటించేలా చేస్తోంది. అదేమంటే హైకోర్టు చెప్పందని చెబుతోంది. ఈ నిర్ణయం ఇప్పుడు మరో వివాదంగా మారుతోంది. ఇప్పటి వరకూ హిందువులు, ముస్లింలు అందరూ కలిసి చదువుకునే విద్యాసంస్థల్లో ఈ సమస్య వచ్చింది.

కానీ ఇప్పుడు ఏకంగా మైనారిటీ కళాశాలల్లోనూ హిజాబ్ ధరించ వద్దని చెప్పడం కచ్చితంగా రెచ్చగొట్టే నిర్ణయంగా ముస్లిం నేతలు, సెక్యులర్ వాదులు విమర్శిస్తున్నారు. వివాదం సద్దుమణుగుతున్న దశలో ఇలా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని మత సామరన్యాన్ని ఎందుకు చెడగొడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే.. హైకోర్టు అన్ని విద్యాసంస్థలు అని చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయడం మా బాధ్యత అంటోంది కర్ణాటక ప్రభుత్వం.

కేవలం ముస్లిం విద్యార్థులే ఉండే చోట కూడా తమ సంప్రదాయానికి అనుకూలంగా వస్త్ర ధారణ చేసే స్వేచ్ఛ మాకు లేదా అని ముస్లిం విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది మరో వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: