ఉత్తరాంధ్ర : జనసేనకు మరీ ఇంత ఆశ పనికిరాదా ?

Vijaya


జనసేన ఓటింగ్ షేర్ ఎంత ? ఇదేమి ప్రశ్న 2019 ఎన్నికల ప్రకారం సుమారు 6 శాతమే కదా అని అనుకుంటున్నారా ? కానీ జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ లెక్కలు వేరేగా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రకారం జనసేన ఓటింగ్ షేర్ మొన్నటి ఎన్నికల్లోనే 60 శాతమట.  ఏ లెక్కల ప్రకారం పార్టీ ఓటింగ్ షేర్ 60 శాతం ఉందో మాత్రం ఆయన చెప్పలేదు. 60 శాతం ఓటింగ్ షేర్ వైసీపీ, టీడీపీల తప్పుడు ప్రచారం వల్ల 6 శాతంకు పడిపోయిందట. అఖండ మెజారిటి 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఓటింగ్ షేరే 51 శాతం.



ప్రత్యర్ధి పార్టీల తప్పుడు ప్రచారంతో ఓటింగ్ షేర్ 60 శాతం నుండి 6కి పడిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా ? రాజకీయాలన్నాక ఒకపార్టీని దెబ్బ కొట్టేందుకే మిగిలిన పార్టీలు ప్రయత్నించటం చాలా సహజం. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి బీజేపీ, టీడీపీ, జనసేన ఏకం కాలేదా ? అయినా రెండుపార్టీలు తప్పుడు ప్రచారంతో జనసేన ఓటింగ్ శాతం 60 నుండి 6కి పడిపోయిందంటే అది కూడా ఒక ఓటింగ్ షేరేనా ? రేపటి ఎన్నికల్లో కూడా మళ్ళీ ప్రత్యర్ధి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తే అప్పుడేమవుతుంది ?



ఇక్కడ పార్టీలోని కీలక నేతలు గమనించాల్సిందేమంటే పవన్ కల్యాణ్ పైనే జనాల్లో నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారనే భావన జనాల్లో బలంగా ఉంది. పవన్ కూడా అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే జనాలు జనసేనను నమ్మలేదు కాబట్లే ఓట్లేయలేదంతే. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగటానికి ఉన్న అవకాశాన్ని పవనే చేతులారా చెడగొట్టుకున్నారు. దాని ఫలితమే ఇపుడు అనుభవిస్తున్నారు.



టీడీపీ, వైసీపీకి తానే నిజమైన ప్రతిపక్షంగా నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని పవన్ వదిలేసుకున్నారు. ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని చెప్పిన పవన్ ఇదే మాట మీద ఉండేంటే మొన్నటి ఎన్నికల్లోనే మంచి ఫలితం వచ్చుండేదేమో. అలాకాదని టీడీపీ ప్రభుత్వం ఎంత ఘోరంగా పరిపాలించినా పవన్ టార్గెట్ మాత్రం జగన్ పైనే పెట్టినపుడే అందరికీ అర్ధమైపోయింది పవన్ ఎవరిని ప్రశ్నించటానికి పార్టీ పెట్టారనేది. చంద్రబాబు, జగన్ను ఒకే పద్దతిలో పవన్ ట్రీట్ చేసుంటే ఇపుడు జనసేన కత వేరే విధంగా ఉండేది. కాబట్టి తప్పులన్నీ తమ అధినేతలోనే పెట్టుకుని ప్రత్యర్ధిపార్టీల పైన పడి ఏడిస్తే ఉపయోగం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: